కేరళ ఆర్టీసీ బస్సులో భారీ అగ్నిప్రమాదం : డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణ నష్టం
బెంగళూరు నగరంలో శనివారం భారీ అగ్నిప్రమాదం తృటిలో తప్పింది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన ఒక లగ్జరీ బస్సు ప్రయాణికులతో రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగి, బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. జ్ఞాన భారతి మెట్రో స్టేషన్ సమీపంలో ఈ భయానక సంఘటన చోటుచేసుకుంది. అయితే, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. పోలీసులు మరియు రవాణా శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని పయ్యన్నూరు నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఈ ఆర్టీసీ బస్సు బెంగళూరు నగరంలోకి ప్రవేశించింది. జ్ఞాన భారతి మెట్రో స్టేషన్ వద్దకు చేరుకోగానే బస్సు ఇంజిన్ క్యాబిన్ నుండి ఒక్కసారిగా పొగలు, మంటలు రావడం ప్రారంభమైంది. నిమిషాల వ్యవధిలోనే ఆ మంటలు బస్సు లోపలి భాగాలకు చొచ్చుకువచ్చాయి.