కొత్త ప్యాకేజీ వీసా ప్రవేశ పెట్టిన సౌదీ అరేబియా
సౌదీ అరేబియా కొత్త ప్యాకేజీ వీసాను ప్రవేశ పెట్టింది. ఇది ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా విమాన టిక్కెట్లు, హోటల్ వసతి, మరియు వీసా దరఖాస్తును ఒకేసారి పూర్తి చేసుకునే సమగ్ర విధానం. దీనివల్ల ప్రయాణికులు వేర్వేరు వెబ్‌సైట్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండా, సింగిల్ పేమెంట్ ద్వారా తమ ప్రయాణ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవచ్చు. సౌదీ ప్రభుత్వం ‘అల్మోసాఫర్’ వంటి ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పర్యాటకులు ఈ గుర్తింపు పొందిన వెబ్‌సైట్లలో తమకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకుని బుక్ చేసుకోగానే, వారి ఫ్లైట్ మరియు హోటల్ వివరాలు ఆటోమేటిక్‌గా వెరిఫై అవుతాయి. ఆ వెంటనే వీసా ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనివల్ల మాన్యువల్‌గా పత్రాలను అప్‌లోడ్ చేసేటప్పుడు జరిగే పొరపాట్లు, వీసా జాప్యాలు తగ్గుతాయి. ఈ వీసా కేవలం విహారయాత్రలు, పర్యాటకం కోసం సౌదీ వెళ్లేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఇది పవిత్ర హజ్ యాత్రకు వర్తించదని పర్యాటకులు గమనించాలి. మొదటిసారి సౌదీ అరేబియాను సందర్శించాలనుకునే వారికి, కుటుంబంతో కలిసి వెళ్లేవారికి ఇది అత్యంత సురక్షితమైన మరియు సులువైన మార్గం. దరఖాస్తుదారుల పాస్‌పోర్ట్‌కు కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉండాలి. నిర్ణీత సైజులో డిజిటల్ ఫోటోగ్రాఫ్ అవసరం. ప్రయాణ సమయానికి సరిపడా మెడికల్ ఇన్సూరెన్స్ (వైద్య భీమా) పత్రాలు సమర్పించాలి. ఒకవేళ ఏదైనా కారణం చేత వీసా తిరస్కరణకు గురైతే, పార్టనర్ ట్రావెల్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం హోటల్, ఫ్లైట్ బుకింగ్స్ మొత్తానికి రీఫండ్ లభిస్తుంది. అయితే, వీసా ప్రాసెసింగ్ ఫీజు మాత్రం తిరిగి రాదు. పేమెంట్ పూర్తయిన తర్వాత బుక్ చేసుకున్న పోర్టల్ ద్వారానే వీసా ఏ దశలో ఉందో సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఈ-వీసాలో ఫ్లైట్, హోటల్ వివరాలను ప్రయాణికులే స్వయంగా సేకరించి, మాన్యువల్‌గా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీసా ఆన్ అరైవల్ కి కఠినమైన ఆర్థిక నిబంధనలు, కొన్ని నిర్దిష్ట క్రెడిట్/డెబిట్ కార్డులు ఉండాలనే నిబంధనలు ఉంటాయి. ఎలాంటి కఠిన నిబంధనలు లేకుండా ప్యాకేజీ వీసా భారతీయ పర్యాటకులందరికీ అందుబాటులో ఉంటుంది. బుకింగ్స్ అన్నీ ప్యాకేజీలోనే ఆటోమేటిక్‌గా వెరిఫై అవుతాయి.