దేశీయ మార్కెట్లోకి రాబోయే ఆరు వారాల వ్యవధిలో ఏకంగా 10 సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నట్లు బజాజ్ ఆటో ప్రకటన చేసింది. ఇందులో పల్సర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండు సరికొత్త మోడళ్లు కూడా ఉన్నాయి. యువత గుండెల్లో 'పల్సర్' బైక్‌లకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. రోడ్డుపై పల్సర్ రయ్‌మంటూ దూసుకెళ్తుంటే ఆ కిక్కే వేరు. అలాంటి ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ఇప్పుడు పండుగ వేళ మార్కెట్‌ను ఏలేందుకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. ఈ కొత్త విడుదలల్లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే.. పల్సర్ బ్రాండ్ నుంచి రాబోతున్న రెండు సరికొత్త బైక్‌లు. 125 సీసీ, 150 సీసీ విభాగాల్లో ఈ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు బజాజ్ సిద్ధమైంది. నెక్ట్స్ జెన్ పల్సర్ 125 ఇప్పటికే రోడ్డు పరీక్షల్లో (రోడ్ టెస్టింగ్) పలుమార్లు కనిపించిన నెక్ట్స్ జనరేషన్ పల్సర్ 125 అత్యంత ఆధునిక ఫీచర్లతో రానుంది. పల్సర్ 150 సరికొత్త డిజైన్, మరింత మెరుగైన మైలేజ్, అధునాతన సాంకేతికతతో 150 సీసీ మోడల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. పెట్రోల్ బైక్‌లతో పాటు ఎంతో ప్రజాదరణ పొందిన 'చేతక్' ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కూడా కొత్త వేరియంట్లను పరిచయం చేయనున్నారు. బజాజ్ ఆటో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ "రాబోయే ఆరు నెలలు కంపెనీకి అత్యంత కీలకం. వినియోగదారుల కోరికలకు అనుగుణంగా కొత్త మార్కెట్ సెగ్మెంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ వాహనాలను అందిస్తున్నాం" అని స్పష్టం చేశారు. డిమాండ్‌కు తగ్గట్టుగా వాహనాలను అందించేందుకు బజాజ్ తన తయారీ సామర్థ్యాన్ని భారీగా విస్తరిస్తోంది. ఈ విస్తరణ కోసం ప్రస్తుత ప్లాంట్లను ఆధునీకరించడంతో పాటు సరికొత్త గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లు, ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీకి ప్రధానంగా కేటాయించనున్నారు. సరికొత్త డిజైన్లతో పల్సర్ మోడళ్లు, పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలు, విస్తృతమైన ఉత్పత్తి ప్రణాళికలతో బజాజ్ ఆటో పండుగ సీజన్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది.
0 Comments