లైసెన్స్ గడువు ముగిసిన ప్రతిసారీ రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న 20 ఏళ్ల డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ కాలాన్ని ఏకంగా 50 ఏళ్లకు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన గనుక అమల్లోకి వస్తే, పౌరులకు మాటిమాటికీ లైసెన్స్ రీన్యూవల్ చేసుకునే అవస్థలు తప్పుతాయి. ప్రస్తుతం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్న పలు కీలక సంస్కరణల్లో డ్రైవింగ్ లైసెన్స్ గడువును 50 ఏళ్లకు పొడిగించే ప్రతిపాదన కూడా ఒకటని అధికారులు ధృవీకరించారు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే అది 20 ఏళ్ల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయసు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ గడువు ముగిసిన తర్వాత వాహనదారులు మళ్లీ దరఖాస్తు చేసుకుని, అవసరమైన పత్రాలతో పాటు నిర్దేశిత వయసు పైబడిన వారు హెల్త్ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించి రీన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా, ఈ మొత్తం ప్రక్రియను సులభతరం చేసేందుకే వ్యాలిడిటీని 50 ఏళ్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. లైసెన్స్ రీన్యూవల్స్ తగ్గిపోతే తమకు వచ్చే ఆదాయం పడిపోతుందని కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే, ఈ మార్పుల వల్ల రాష్ట్రాలకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లదని కేంద్ర అధికారులు భరోసా ఇస్తున్నారు. లైసెన్స్ జారీ లేదా రీన్యూవల్‌కు సంబంధించిన ఫీజులను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నిరంతరాయంగా వసూలు చేసుకోవచ్చని, దీనివల్ల ఆదాయ వనరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు వివరించారు. కేవలం డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా, రవాణా రంగానికి సంబంధించి మరికొన్ని కీలక సేవలను కూడా డిజిటలైజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వాహనాల యాజమాన్య బదిలీ, పర్మిట్ల పునరుద్ధరణ వంటి సేవలను పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని చూస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లకు 'నెగటివ్ పాయింట్లు' కేటాయించేలా ఒక కఠినమైన వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఈ నెగటివ్ పాయింట్ల ఆధారంగా సదరు డ్రైవర్ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం (క్యాన్సిలేషన్) జరుగుతుంది. దీనివల్ల ఎంత కాలం వ్యాలిడిటీ ఉన్నా.. డ్రైవర్లు బాధ్యతాయుతంగా నడుచుకునేలా నియంత్రించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
0 Comments