'పవనన్నా - నన్ను ఆదుకోండి' : సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో బాధను వెల్లడించిన మహిళ
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్ అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువు కోసం డబ్బు సంపాదించాలనే ఆశతో, ఆమె ఇటీవల ఒక ఏజెంట్ సహాయంతో అప్పులు చేసి మస్కట్‌కు వెళ్లింది. అయితే అక్కడ పరిస్థితులు ఆమె ఊహించినట్లుగా లేకపోయాయని, పనికి పంపిన వ్యక్తి తనను తీవ్రంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వీడియోలో ఆమె తన బాధను వెల్లడించింది. తాను పనిచేస్తున్న చోట యజమాని తనను ఒక గదిలో బంధించి, సరైన ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా కొడుతూ హింసిస్తున్నాడని కన్నీటి పర్యంతమై చెప్పింది. తనకు బయట ప్రపంచంతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని, ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని, తరచూ ఫిట్స్ వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తనను రక్షించాలని ఆమె ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను వేడుకుంది. తాను చనిపోతే తన ముగ్గురు చిన్నపిల్లల పరిస్థితి ఏమవుతుందో అనే ఆందోళన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. బాత్రూంలో దాక్కొని ఈ వీడియో రికార్డు చేస్తున్నానని, యజమానికి విషయం తెలిసితే తనను చంపేస్తాడనే భయంతో ఉన్నానని చెప్పింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే కార్మికుల భద్రత, మధ్యవర్తుల పాత్రపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితురాలికి సహాయం అందించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన ఓ మహిళ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు మనసును కలిచివేస్తున్నాయి. బతుకుదెరువు కోసం తీసుకున్న నిర్ణయం ఆమెను ప్రమాదకర స్థితిలోకి నెట్టిందని వెల్లడించే ఈ ఘటన ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతూ, సహాయం కోసం చేసిన ఆమె కన్నీటి వినతి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.