జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి
జమ్మూకాశ్మీర్ లోని ఛత్రూ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. 'ఆపరేషన్ త్రాషి-I' పేరుతో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఎన్ కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదులు నిషేధిత జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారిగా తెలుస్తోంది. వీరిలో ఒకరిని మోస్ట్ వాంటెడ్ కమాండర్ సైఫుల్లాగా గుర్తించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను, భారీగా మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో అడవిని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.