బీసీ రక్షణ చట్టం కోసం ముసాయిదాను రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా నిలిచింది. చాలా ప్రాంతాల్లో జరుగుతున్న సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు చరమగీతం పాడేందుకు 'బీసీ రక్షణ చట్టం' కోసం ముసాయిదాను రూపొందించింది. మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చనున్నారు. ఈ చట్టం ద్వారా ఎవరైనా బీసీలపై దాడికి పాల్పడితే ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. తొలిసారి జైలు శిక్ష అనుభవించి మళ్లీ బయటకు వచ్చిన తర్వాత పద్దతి మార్చుకోకుండా మరోసారి నేరానికి ఒడిగడితే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అట్రాసిటీలకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉంది. నేరానికి పాల్పడినట్లు అభియోగాలు వచ్చినప్పుడు ఓ వ్యక్తిని ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం సృష్టించి ఇరికించే ప్రయత్నం చేస్తే నేరాభియోగాలు మోపిన వ్యక్తికి మరణ దండన లేదా జీవిత ఖైదు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. బీసీలపై నేరాలకు సంబంధించి కంప్లైంట్ తీసుకుని, కేసు నమోదు చేసిన 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చేసినా.. కావాలనే కాలయాపన చేసినా.. సదరు అధికారులకు కనీసం 6 నెలల నుంచి గరిష్ఠంగా ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పొందుపరిచారు. బీసీలన భయపెట్టినా, కావాలనే అవమానించినా, కులం పేరుతో అవమానకర పదాలు వాడినా, తక్కువ చేసినా మాట్లాడినా ఈ చట్టం ద్వారా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రామ బహిష్కరణ చేసినా.. వారికి రావాల్సిన అన్ని రకాల సేవలు నిలిపివేసినా, ప్రజాసేవల్లో వివక్ష చూపినా జైలుకు పోవాల్సిందే. ఇక భౌతిక దాడులు చేసి.. గాయాలపాలైనా, లేదా చొక్కా పట్టుకున్నా కేసు పడుతుంది. కబ్జాలు చేసినా, జీవనోపాధిని దెబ్బతీసినా, మత పరంగా దూరం పెట్టినా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననీయకకుండా చేసినా, బావులు, రహదారులు, ఘాట్లు వాడుకోకుండా అడ్డుకున్నా.. శ్మశానాలు, ఆలయాల్లోకి ప్రవేశాన్ని నిరాకరించినా బెయిల్ కూడా రాకుండా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. పౌరహక్కుల చట్టం-1955లోని సెక్షన్ 10ఏ ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.