తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై శాసన సభలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 4 వీలర్ తేలికపాటి గూడ్స్ వాహనాలకు త్రైమాసిక టాక్స్ ఉండేదని ప్రస్తావించారు. రవాణా శాఖ నిపుణులతో చర్చించి గూడ్స్‌కి సంబంధించిన వాహనాలపై లైఫ్ టాక్స్ విధిస్తూ 7.5 శాతానికి చేశామని వివరించారు. ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రోడ్ సేఫ్టీపై సెస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక , మహారాష్ట్ర ,గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, లైట్ మోటార్ వాహనాలకు రూ.5 వేలు , హెవీ వాహనాలకు రూ.10 వేలు రోడ్ సేఫ్టీ సెస్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు మాత్రమే రోడ్ సేఫ్టీ సెస్ విధించినట్లు వివరించారు. ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఇది వర్తించదని స్పష్టం చేశారు. మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతోనే జరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఒక ప్రకటన చేశారని ప్రస్తావించారు. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తాము రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. ఇందు కోసం విద్యా శాఖ ,సంక్షేమ శాఖ పాఠశాలలు పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. రోడ్డు భద్రతాపై విద్యార్థులకు ప్రతి పౌరునికి అవగాహన కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. యూనిసెఫ్ సహకారంతో స్కూల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తెలంగాణను రోడ్డు ప్రమాదాల రహితంగా మార్చడానికి జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు ఉంటే 1. 80 లక్షల వాహనాలు ఉన్నాయని..ఒక్కొక్కటిగా వాహనాలు పరిశీలించడం కుదరదని చెప్పుకొచ్చారు. ఎవరికి వారు స్వయంగా వాహనాల ఫిట్‌నెస్ చూసుకోవాలని.. రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. వికారాబాద్ బస్సు ప్రమాదంలో ఎవరో చేసిన తప్పిదానికి అమాయకులు చనిపోయారని అన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ విద్యార్థులు, ఇతర పాఠశాలల్లోని విద్యార్థులు రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు , అధికారులు విద్యార్థులు అందరూ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో పాల్గొనాలని మార్గనిర్దేశం చేశారు. బ్లాక్ స్పాట్‌లను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అతి వేగాన్ని కట్టడి చేసేలా కెమెరా లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రోడ్ సేఫ్టీ మంత్‌పై లేఖ రాశారని ప్రస్తావించారు. రోడ్ సేఫ్టీపై ప్రజలు, అన్ని విభాగాల అధికారులు భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నామనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. గూడ్స్ ఆటోలకు , తేలికపాటి వాహనాలకు మాత్రమే త్రైమాసిక టాక్స్ నుంచి లైఫ్ టాక్స్ లోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. దాదాపు రూ.1000 కోట్లు టాక్స్ ప్రభుత్వం నష్టపోయిందని అన్నారు.. హైదరాబాద్‌లో ఈరోజు ఎయిర్ క్వాలిటీ 300 దాటిందని అంటున్నారని తెలిపారు. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతాయని, దీంతో కాలుష్యాన్ని అరికడుతున్నామని చెప్పుకొచ్చారు. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని.. 15 ఏళ్లు దాటిన వాహనాలు ఈ స్క్రాప్ పాలసీలోకి వస్తాయని వెల్లడించారు. త్వరలో ఢిల్లీ మాదిరిగా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రైవింగ్ స్కూల్స్‌పై కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో వాహన సారధిలో తెలంగాణ చేరలేదని చెప్పుకొచ్చారు. దేశంలో 29 రాష్ట్రాలు వాహన సారధిలో చేరితే తెలంగాణ మాత్రం చేరలేదని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వాహన సారధిలో చేర్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
0 Comments