సిర్పూర్ లో 16 మంది మావోయిస్టుల అరెస్టు : పట్టుబడిన వారిలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు?


తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు) మండలం బాజ్జీపేట పంచాయితీ పరిధిలోని పెద్దదోబ గూడెంలో ఓ ఇంట్లో మావోయిస్టులు వున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఛత్తీస్‌ఘడ్‌ లో మావోయిస్టుల కోసం పోలీసులు భారీ ఆపరేషన్ కొనసాగుతుండడంతో అక్కడ వున్న నక్సలైట్లు తెలుగు రాష్ట్రాలలో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇక్కడి పోలీసులు సరిహద్దు జిల్లాలలో నిఘా వుంచారు. ఈ క్రమంలోనే సిర్పూర్ (యు) మండలం పెద్దదోబ గూడెంలో నక్సలైట్లు ఆశ్రయం పొందినట్లు గుర్తించిన పోలీసులు కుమురం భీం ఏఎసిపి చిత్తరంజన్ నేతృత్వంలో దాడి చేశారు. ఈ సందర్భంగా మావోయిస్టు సానుభూతిపరులతో కలిసి వెళ్లిన పోలీసులు నక్సలైట్లు ఆశ్రయం పొందిన ఇంటిపై దాడిచేసి ఎలాంటి ఎదురు కాల్పులు లేకుండానే అక్కడ వున్న 16 మందిని అ దుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక ఎకె 47, రెండు ఇన్సాస్ రైపిళ్లు, కొంత మందుగుండు సామాగ్రిని జప్తు చేశారు. పట్టుబడ్డ వారిలో మావోయస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వున్నట్లు తెలిసింది. అరెస్టయిన నక్సలైట్లలో తొమ్మిది మంది మహిళలు కూడా వున్నట్లు తెలిసింది. నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చిన పెద్దబోడ వాసులు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ మావోయిస్టులంతా ఛత్తీస్‌ఘడ్‌ లోని బీజాపూర్ వాసులుగా చెబుతున్నారు. వీరందరిని హైదరాబాద్ కు  ప్రత్యేక వాహనంలో తరలించి ఒక రహస్య ప్రాంతంలో ఎస్ఐబి పోలీసుల సమక్షంలో విచారిస్తున్నారు. కాగా నక్సలైట్ల అరెస్టు గురించి పోలీసులు మౌనం వహించారు. అరెస్టయిన వారిలో వున్నట్లుగా చెబుతున్న బడే చొక్కారావు స్వగ్రామం ములుగు జిల్లా కాల్వపల్లి. వీరిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం నాయకులు కోరుతున్నారు. ఇదిలావుండగా ఆసిఫాబాద్ లో నక్సలైట్లు పట్టుబడిన ఉదంతం వెనుక వారు వినియోగించిన సెల్ ఫోన్ లే కారణమని తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌ కు చెం దిన మావోయిస్టు అగ్రనేతలతో పాటు ముఖ్య నేతలు వాడే సెల్ ఫోన్ నంబర్లను పోలీసులు సేకరించి వాటిపై కొంతకాలంగా నిఘా వుంచారు. ముఖ్యంగా ఛత్తీస్‌ఘడ్‌ కు చెందిన అనుమానిత ఫోన్లు తెలంగాణ సరిహద్దుల్లో వాడితే నిఘా వర్గాలకు ఇట్టే తెలిసిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఛత్తీస్‌ఘడ్‌ లో కూంబింగ్ నేపథ్యంలో తెలంగాణలో కొంతకాలం ఆశ్రయం పొందాలని వచ్చిన మావోయిస్టులు తమ అనుచరులతో  సెల్ ఫోన్ ల్లో వరుసగా మాట్లాడారని తెలిసింది. దీనిని పసిగట్టిన నిఘా వర్గాలు పోలీసులకు పక్కా సమాచారం అందించడంతో వారు అందరిని అరెస్టు చేశారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org