నారా రామ్మూర్తి నాయుడు మృతి !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందిన రామ్మూర్తి నాయుడు నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో ఈరోజు హుటాహుటిన చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్ఛారు. నారా రామ్మూర్తి నాయుడు 1952లో ఉన్నారా ఖర్జూర నాయుడు, అమ్మణమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో నారా రోహిత్ కాగా, మరొకరు నారా గిరీష్. 1994 నుండి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొంతకాలం పాటు టీడీపీ లో కీలకంగా పనిచేసిన ఆయన ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. నారా రామ్మూర్తి నాయుడు మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టిడిపి శ్రేణులు కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.