Ad Code

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు ఇంగ్లీష్‌ మీడియం వారు తెలుగులోనూ రాసుకోవచ్చు!


ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం  అవకాశం ఇచ్చింది. పబ్లిక్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు కావాలంటే ఐచ్ఛికాన్ని మార్చుకోవచ్చని సూచించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల వారిని ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతూ గత వైకాపా ప్రభుత్వం 2020-21లో ఆదేశాలిచ్చింది. ఆంగ్ల మాధ్యమం అమలుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైనందున 'ఇంగ్లీష్‌ మీడియం' అని వాడకుండా 'ఒకే మాధ్యమం' ఉండాలని ఆదేశించారు. అనధికారికంగా ఆంగ్ల మాధ్యమమే అన్నట్లు వ్యవహరించారు. ఒక్కో తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్లు ప్రకటిస్తూ, పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన పెట్టారు. ఒకే మాధ్యమం అమలు చేయాలని చెప్పడం మినహా ఏ మాధ్యమం అనేది చెప్పకపోవడంతో చాలా పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. ఇలా తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులు కోరడంతో ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదీకి అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి చదువుతున్న వారు 6.20 లక్షల మంది ఉండగా, ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ నామినల్‌ రోల్స్‌లో 4.94 లక్షల మంది విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఇందులో 39 వేలకుపైగా విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాస్తారని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం అమలవుతున్నట్లు రికార్డుల్లో నమోదు చేసింది. క్షేత్రస్థాయిలో తరగతులు, బోధనను పట్టించుకోకుండా ఒకే మాధ్యమం అంటూ పేర్కొంది. విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలు ఇస్తున్నందున చాలాచోట్ల తెలుగులోనే పాఠాలు చెప్పగా.. విద్యార్థులు మాతృభాషలోనే చదువుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో విద్యార్థులు ఎలా రాసినా మార్కులు ఇచ్చేశారు. ఒకేసారి తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయడంతో వీరు అభ్యసనకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ బ్యాచ్‌ విద్యార్థులు పదో తరగతికి రావడంతో ఆంగ్లంలో చదివి, ఆంగ్లంలో పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.

Post a Comment

0 Comments

Close Menu