వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకురావాలి : మంత్రి సీతక్క
హైదరాబాద్ లోని మాదాపూర్ టెక్ మహీంద్రా లెర్నింగ్ వరల్డ్ లో తెలంగాణ సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్కింగ్ (ఐడబ్ల్యుఎన్) నిర్వహించిన వార్షిక లీడర్ షిప్ కాన్ క్లేవ్ 2024 - 10వ ఎడిషన్ లో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడుతూ మహిళలు సమాజ సృష్టికర్తలు అని, సమాజంలో స్త్రీల పట్ల ఇంకా చిన్న చూపు చూసే మనస్తత్వం ఉందని అందువల్లే మహిళలు వెనుకబడి ఉన్నారని అన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీలు తోటి మహిళకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. పని ప్రదేశాలలో మహిళల వేధింపులపై స్పందిస్తూ పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను సహించేది లేదని హెచ్చరించారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.