సిపిఎం సమన్వయకర్తగా ప్రకాష్ కరత్ నియామకం !
సిపిఎం సమన్వయకర్తగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్‌ను సిపిఎం కేంద్ర కమిటీ నియమించింది. ఈ మేరకు ఆదివారం సిపిఎం కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల పాటు జరిగే సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం హరికిషన్ సింగ్ సుర్జీత్ (హెచ్‌కెఎస్) భవన్‌లో ప్రారంభమయ్యాయి. తొలిత సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణానికి సంతాపం తెలిపిన కేంద్ర కమిటీ వివిధ అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ ప్రకాష్ కరత్‌ను సిపిఎం పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీలకు సమన్వయ కర్తగా నియమించింది. 2025 ఏప్రిల్‌లో తమిళనాడులోని మధురైలో జరిగే సిపిఎం 24వ పార్టీ మహాసభ జరిగే వరకు ప్రకాష్ కరత్ ఈ బాధ్యతల్లో ఉండనున్నట్లు తెలిపింది. ప్రస్తుత సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆకస్మిక మరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు మానిక్ సర్కార్, బివి రాఘవులు, సూర్యకాంత్ మిశ్రా, సుభాషిణి అలీ, ఎండి సలీం, ఎంఎ బేబి, తపన్ సేన్, జి.రామకృష్ణ, ఎ.విజయరాఘవన్, నిలోత్పల్ బసు, అశోక్ దావలే, రామచంద్రడోమ్, గోవిందన్ మాస్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్. అరుణ్ కుమార్ హేమలత, పుణ్యవతి, జి.నాగయ్య, సిహెచ్ సీతారాములు, బి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.