నిద్రలో ఉన్న నన్ను నా కుమార్తే మేల్కొలిపింది : సుధా మూర్తి !


న్ఫోసిన్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగా, రచయిత్రిగా సుపరిచితురాలైన సుధామూర్తి వితరణ గురించి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉన్న గొప్పతనాన్ని తాను గుర్తించేలా చేసిన తన కుమార్తె అక్షతామూర్తి గురించి వెల్లడించారు. ఈమేరకు ఓ వీడియోను షేర్ చేశారు. ''నా కుమార్తె అక్షతామూర్తి ఆలోచనా దృక్పథమే మనకున్నదాంట్లో కొంత నలుగురితో పంచుకోవడంలో ఉన్న సంతోషాన్ని గుర్తించేలా చేసింది'' అని సుధామూర్తి వెల్లడించారు. ఆ దిశగా అక్షత తనను మేల్కొలిపారన్నారు. ఒక స్పాన్సర్‌షిప్‌ కోసం ఆమె చేసిన అభ్యర్థనతోనే ఈ దాతృత్వ ప్రయాణం ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. ''అక్షత ఒకరోజు నా దగ్గరకు వచ్చి, ఆనంద్ శర్మ అనే అబ్బాయి గురించి చెప్పింది. అతడు ఎంతో చురుకైన విద్యార్థి అని, అయితే పైచదువులు చదివే తాహతు లేదని వెల్లడించింది. అతడికి దిల్లీలోని కళాశాలలో అడ్మిషన్‌ వచ్చినా, ఫీజు ఎవరు కడతారని ప్రశ్నించింది. నువ్వే అని నేను చెప్పా. కానీ నువ్వు ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదుగా.. నేనెలా ఇవ్వాలని తిరిగి అడిగింది'' అని సుధ వెల్లడించారు. మామూలుగా ఆమె తన పిల్లల చేతికి డబ్బులు ఇచ్చేవారు కాదట. వారికేం కావాలో చెప్తే.. వాటిని తీర్చడానికి ట్రై చేసేవారట. అందుకే అక్షత ఆ మాట అన్నారు. తర్వాత ఆనంద్‌కు సాయం చేయడంపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ''అమ్మా.. నువ్‌ బాగా చదువుతావు. ప్రయాణాలు చేస్తావు. తెలివైనదానివి. నువ్వు దాతృత్వం వైపు వెళ్లకుండా.. ఈ విషయంలో ఇతరులకు సలహా ఇవ్వడం కుదరదు'' అని అక్షత ఆ రోజు తనతో అన్న మాటలు తనపై బాగా పనిచేశాయని సుధామూర్తి చెప్పారు. దీనిపై కొద్దిరోజులపాటు ఆలోచించిన ఆమె.. తర్వాత పూర్తిస్థాయిలో దాతృత్వం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ''నిద్రలో ఉన్న నన్ను నా కుమార్తే మేల్కొలిపింది'' అని వ్యాఖ్యానించారు.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org