కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదు !
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొందరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్న ఊహాగానాలు షీకారు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీలేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ను గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయని, కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలే గుర్తిస్తారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, వెంటనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ఉలిక్కిపాటుకు గురైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లో ఫిరాయింపులకు కళ్లెం వేసేందుకుగాను ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు మంగళవారం పలువురు ఎమ్మెల్యేలను సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పిలిపించుకొని మాట్లాడారు.