గవర్నర్, మమతా బెనర్జీ మధ్య వాగ్వాదం అవమానకరం !
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్ మధ్య వాగ్వాదం అవమానకరమని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఇది దిగజార్చిందని ఆయన విమర్శించారు. గవర్నర్ సీవీ ఆనంద బోస్ సీఎం మమతా బెనర్జీపై కలకత్తా హైకోర్టులో పరువు నష్టం దావా వేయడం గురించి అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌పై సీఎం మమతా చేసిన ఆరోపణలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని అన్నారు. దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 'వాదనలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలను సీఎం అందించాలి. సరైన విచారణ జరగాలి' అని అన్నారు. కాగా, గవర్నర్, సీఎం మమత మధ్య ఆరోపణల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతున్నదని అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. ఇరుపక్షాలు ఆరోపణలు చేసుకునే బదులు వారి వాదనలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు పశ్చిమ బెంగాల్ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. ఇది అవమానకరమైన ఎపిసోడ్ తప్ప మరొకటి కాదు' అని వ్యాఖ్యానించారు.