ホーム
/
technology
/
ఉద్యోగుల తొలగింపు, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో ఏఐ వినియోగం పూర్తి నిషేధం : చట్టం చేసిన కాలిఫోర్నియా రాష్ట్రం
Thursday, October 1, 2026
'No Robot Bosses Act' (SB 947) California Enacts Law Banning Use of AI for Employee Terminations and Disciplinary Actions international science technology
కృత్రిమ మేధ ఆధారంగా ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కాలిఫోర్నియా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ రకమైన చట్టాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రంగా నిలిచింది. కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ 'నో రోబో బాసెస్ యాక్ట్' (SB 947) పై సంతకం చేసినట్టు సీఎన్‌బీసీ వార్తా ఛానల్ నివేదించింది. చట్టం అమల్లోకి రావడంతో ఇకపై ఉద్యోగుల తొలగింపు, క్రమశిక్షణా చర్యలకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి. ఈ చట్టం గురించి గవర్నర్ గెవిన్ న్యూసమ్ మాట్లాడుతూ ''ఏ ఉద్యోగి కూడా కేవలం ఆల్గారిథమ్స్ ఆధారంగా తమ కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలను ఎదుర్కోరాదు, యంత్రం లేదా ఏఐ నిర్ణయాల వల్ల ఏ ఒక్కరూ ఉద్యోగం కోల్పోకూడదు, చర్యలకు గురికాకూడదు. ఏఐ ఉత్పాదకతను పెంచగలదు. కానీ తప్పులు చేయడానికి, పక్షపాతం చూపించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి'' అని స్పష్టం చేశారు. కాలిఫోర్నియా వ్యాపార సంస్థలు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి లేదా తొలగించడానికి కేవలం 'ఆటోమేటెడ్ డిసిషన్ మేకింగ్ సిస్టమ్స్' (ఏఐ) పై ఆధారపడటాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధిస్తుంది. ఒకవేళ ఏఐ సిస్టమ్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా కంపెనీలు నిర్ణయం తీసుకోవాలనుకుంటే, ఆ విషయాన్ని మానవ పరిశీలన, ఇతర నివేదికల ద్వారా ధ్రువీకరించుకోవాలి. మేనేజర్ల అంచనాలు, సహోద్యోగుల సమీక్షలు, ఉద్యోగుల పర్సనల్ రికార్డులను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ఒక ఉద్యోగిపై తీసుకునే నిర్ణయంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తే, ఆ విషయాన్ని సదరు ఉద్యోగికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. ఏ డేటా ఆధారంగా ఏఐ ఆ నిర్ణయం తీసుకుందో వివరించడంతో పాటు, సందేహాలను నివృత్తి చేయడానికి ఓ అధికారి సమాచారాన్ని అందించాలి. ఈ బిల్లును రూపొందించిన డెమొక్రాటిక్ స్టేట్ సెనేటర్ జెర్రీ మెక్‌నెర్నీ మాట్లాడుతూ ''ఏఐ అనేది మానవ నియంత్రణలో ఉండే ఒక సాధనంగా మాత్రమే ఉండాలి తప్ప, అదే మానవులను శాసించే నిర్ణేతగా మారకూడదు'' అని అన్నారు. ఉద్యోగులపై ఏఐ పరిమితులు విధించడాన్ని వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియాలోని కార్మిక సంఘాలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందడంపై కాలిఫోర్నియా ఫెడరేషన్ ఆఫ్ లేబర్ యూనియన్స్ ఛైర్మన్ లోరెనా గొంజాలెజ్ హర్షం వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో ఏఐ వాడకం నియంత్రించడంలో కాలిఫోర్నియా దేశానికి దిక్సూచీగా నిలిచిందని, అమెరికా వ్యాప్తంగా ఏఐ ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు ఇది ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుందని ఆమె అన్నారు. కార్మికుల రక్షణకు ఫెడరల్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని నేపథ్యంలో గవర్నర్ న్యూసమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఏఐ మోడల్స్ వల్ల కలిగే ప్రమాదాల నివారణకు కార్యనిర్వాహక ఉత్తర్వు, ఏఐ సిస్టమ్స్ స్వతంత్ర మూల్యాంకనం, ఆడిటింగ్ కోసం ఒక రాష్ట్ర స్థాయి ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆయన ఏర్పాటు చేశారు. గతేడాది ఓఈసీడీ సర్వే ప్రకారం ఆటోమేటెడ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ వినియోగంలో అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దాదాపు 90 శాతం మంది అమెరికా మేనేజర్లు తమ సంస్థల్లోని ఉద్యోగుల పర్యవేక్షణ లేదా పనితీరు అంచనా వేయడానికి కనీసం ఒక ఏఐ టూల్‌నైనా ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. అయితే దీనివల్ల వివాదాలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది జులైలో ఉద్యోగుల తొలగింపు విషయంలో 'మెటా' సంస్థపై ఒక కేసు నమోదైంది. లేఆఫ్స్ కోసం జాబితా తయారీకి ఏఐ ఉపయోగించారని, దీనివల్ల మెడికల్ లేదా ఫ్యామిలీ లీవ్ తీసుకున్న ఉద్యోగులు ఎక్కువగా నష్టపోయారని బాధితులు ఆరోపించారు అలాగే యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్ సర్వేలోనూ వాల్‌మార్ట్, అమెజాన్ వంటి సంస్థల్లో హెచ్ఆర్ నిర్ణయాలు సరైన పర్యవేక్షణ లేకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారనే ఆందోళన వ్యక్తమైంది.
No comments:
Post a Comment