భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
Thursday, October 1, 2026
CrimeJangareddypalli village Married Woman Dies by Suicide After Husband's Harassment Narva Mandal of Narayanpet district telangana
తెలంగాణ లోని నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నర్వ ఎస్‌ఐ పబ్బతి రమేష్ తెలిపారు. జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అనూషకు అదే గ్రామానికి చెందిన గడ్డం అశోక్‌తో 2019లో వివాహం జరిగింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ విభేదాలు కొనసాగుతున్నట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. అశోక్ తన భార్యను అనుమానిస్తూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడని ఆరోపించారు. ఈ విషయమై ఇరువురి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ కుటుంబ విభేదాలు కొనసాగినట్లు తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 30న అనూష ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. తన కుమార్తెను భర్త వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నర్వ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ పబ్బతి రమేష్ తెలిపారు.
No comments:
Post a Comment