గుజరాత్ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు-2026కు రాష్ట్రపతి ఆమోదముద్ర : రెండో రాష్ట్రంగా రికార్డుకెక్కిన గుజరాత్
Friday, October 2, 2026
After Uttarakhand Gujarat Becomes the Second State to Achieve This Milestone national Presidential Assent for Gujarat Uniform Civil Code Bill-2026
గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు-2026కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఉత్తరాఖండ్ తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని చట్టబద్ధం చేసిన రెండో రాష్ట్రంగా గుజరాత్ రికార్డుకెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నిబంధనలను (రూల్స్) నోటిఫై చేసిన వెంటనే ఈ చట్టం అమలులోకి రానుంది. మార్చి 24న సుదీర్ఘ చర్చ అనంతరం గుజరాత్ అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించిన వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. కాగా, రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల జనాభాకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. పెళ్లి జరిగిన 60 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేశారు. అలా చేయకపోతే రూ. 10,000 వరకు జరిమానా విధిస్తారు. బహుభార్యత్వాం, ద్వైపాక్షిక వివాహాలను పూర్తిగా నిషేధించారు. బలవంతంగా లేదా మోసపూరితంగా పెళ్లి చేసుకుంటే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సాంప్రదాయ లేదా కోర్టు బయటి విడాకులకు చెల్లుబాటు ఉండదు. నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ట్రిపుల్ తలాక్, నికా హలాలా నిషేధించబడ్డాయి. తల్లిదండ్రుల ఆస్తిలో కుమారులతో పాటు కుమార్తెలకు సమాన హక్కులు కల్పించారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండే జంటలు తమ వివరాలను అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి చేశారు. విడిపోయినప్పుడు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంబంధం ద్వారా జన్మించిన పిల్లలకు చట్టబద్ధతతో పాటు తండ్రి ఆస్తిలో హక్కులు లభిస్తాయి. లివ్-ఇన్ భాగస్వామి మోసం చేస్తే మహిళ భరణం (Maintenance) క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించారు. కాగా అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 రద్దుతో పాటు 'యూనిఫాం సివిల్ కోడ్' అనేది బీజేపీ మూడు ప్రధాన అజెండాలలో ఒకటిగా ఉంటూ వస్తోంది. అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా యూసీసీ చట్టాలను ఆమోదించినప్పటికీ అవి ఇంకా అమలులోకి రాలేదు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు ముసాయిదా కమిటీలను ఏర్పాటు చేశాయి. అయితే గోవాలో మాత్రం స్వాతంత్య్రానికి పూర్వమే ఉన్న 1867 నాటి పోర్చుగీస్ సివిల్ కోడ్ అమలులో ఉంది.
No comments:
Post a Comment