మరోసారి భారీగా పెరగనున్న మహీంద్రా అండ్ మహీంద్రా SUVల ధరలు
الأحد، 27 سبتمبر 2026
automobile business Mahindra & Mahindra SUVs Set for Another Major Price Hike Nalinikanth Gollagunta President and CEO of Mahindra Automotive told PTI
మహీంద్రా అండ్ మహీంద్రా SUVల ధరలను మరోసారి పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇటీవలి కాలంలో కమోడిటీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల తయారీ వ్యయంపై ప్రభావం పడుతోందని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో SUV పోర్ట్‌ఫోలియోపై మరో ధర పెంపు అవసరమా? లేదా? అనే విషయంపై రాబోయే రెండు వారాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహీంద్రా ఆటోమోటివ్ ప్రెసిడెంట్, సీఈఓ నళినీకాంత్ గొల్లగుంట తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే కంపెనీ ఇప్పటికే మూడుసార్లు వాహనాల ధరలను పెంచినట్లు చెప్పారు. జనవరి, ఏప్రిల్, జూలై నెలల్లో ధరలను సవరించినట్లు వివరించారు. ముఖ్యంగా జూలైలో SUVల ధరలు దాదాపు 2.7 శాతం మేర పెరిగాయి. కమోడిటీ ధరలు, ఉత్పత్తి వ్యయాల్లో మార్పులను కంపెనీ నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన తెలిపారు. ధరల పెంపు విషయాన్ని కంపెనీ తేలిగ్గా తీసుకోవడం లేదని నళినీకాంత్ స్పష్టం చేశారు. "మాకు మరోసారి ధరలు పెంచాల్సిన అవసరం ఉందా? అనే అంశంపై బహుశా రాబోయే రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం పెంచుతామని లేదా పెంచబోమని చెప్పలేం. అయితే కమోడిటీల ధరల్లో ఇటీవల వచ్చిన పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆటో రంగంలో చోటుచేసుకున్న ధరల పెంపు వల్ల మహీంద్రా SUVలకు వస్తున్న కస్టమర్ విచారణలు, బుకింగ్‌లపై పెద్దగా ప్రభావం పడలేదని కంపెనీ తెలిపింది. దీనికి ప్రధాన కారణం వాహనాల ప్రస్తుత ధరలు GST తగ్గింపులకు ముందు ఉన్న స్థాయితో పోలిస్తే ఇంకా తక్కువగా ఉండటమేనని గొల్లగుంట వివరించారు. దీంతో ప్రస్తుతానికి SUVలకు డిమాండ్ బలంగానే కొనసాగుతోందని చెప్పారు. పండుగల సీజన్‌పై కూడా మహీంద్రా ఆశావహంగా ఉంది. సాధారణంగా దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో కార్ల కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ ఏడాది కూడా పరిశ్రమలో, ముఖ్యంగా SUV విభాగంలో మంచి డిమాండ్ ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. GST తగ్గింపుల కారణంగా వాహనాల ధరలు గత ఏడాదితో పోలిస్తే వినియోగదారులకు అనుకూలంగా ఉన్నాయని, అదే సమయంలో మహీంద్రా తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను కూడా రిఫ్రెష్ చేస్తోందని గొల్లగుంట తెలిపారు. ధరల పెంపు వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ ఒత్తిడిని కంపెనీ గమనిస్తోందని ఆయన చెప్పారు. అయితే గత ఏడాది GSTలో వచ్చిన మార్పుల కారణంగా వాహనాల ధరలు GSTకి ముందు ఉన్న స్థాయితో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉన్నాయని వివరించారు. దీంతో ఇటీవల జరిగిన ధరల పెంపులను పరిగణనలోకి తీసుకున్నా కస్టమర్లకు వాహనాల ధరలు ఇప్పటికీ కొంత ఉపశమనాన్ని అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, హైబ్రిడ్ వాహనాల విషయంలో మహీంద్రా తన వ్యూహాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV)పై దృష్టి పెడుతోందని గొల్లగుంట తెలిపారు. దేశ ఆటోమొబైల్ రంగం దీర్ఘకాలంలో EVల వైపు వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. CAFE వంటి నిబంధనలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ తన ఉత్పత్తి వ్యూహాన్ని రూపొందిస్తోందని వివరించారు. అయితే భవిష్యత్తులో ప్రభుత్వ నియంత్రణలు లేదా రెగ్యులేటరీ విధానాల్లో మార్పులు వస్తే వాటికి అనుగుణంగా మారే సామర్థ్యం తమకు ఉందని మహీంద్రా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి మాత్రం కంపెనీ ప్రధాన దృష్టి EVలపైనే ఉంటుందని గొల్లగుంట చెప్పారు.
ليست هناك تعليقات:
إرسال تعليق