కృష్ణా నదిలో విలాసవంతమైన హౌస్‌బోట్లు, డిన్నర్ క్రూయిజ్‌లు : ప్రైవేట్ కంపెనీకి అనుమతులు మంజూరు
الأحد، 27 سبتمبر 2026
Andhra Pradesh Tourism Department Luxury Houseboats and Dinner Cruises on the Krishna River Permissions Granted to Private Company
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ విజయవాడలోని కృష్ణా నదిలో కేవలం సాధారణ నదీ విహారానికే పరిమితం కాకుండా హౌస్‌బోట్ లు, డిన్నర్ క్రూయిజ్‌లు, పార్టీలు, కార్పొరేట్ సమావేశాలకు వేదికగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తుంది. పర్యాటకులను మరింత ఆకర్షించేలా సరికొత్త విలాసవంతమైన నౌకలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఓ ప్రైవేట్ కంపెనీకి అనుమతులు మంజూరు చేయగా, ఇప్పటికే నౌకల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.30 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మరో నాలుగు నుంచి ఐదు నెలల్లో ఈ ప్రత్యేక నౌకలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం క్రూయిజ్ విహారమే కాకుండా వసతి, భోజనం, వినోదం, ప్రైవేట్ వేడుకలను ఒకే చోట ఆస్వాదించేలా వీటిని డిజైన్ చేస్తున్నారు. కేరళ, కాశ్మీర్ ప్రాంతాల మాదిరిగానే విజయవాడలోనూ విలాసవంతమైన హౌస్‌బోట్ అనుభూతిని అందించనున్నారు. ఈ లగ్జరీ హౌస్‌బోట్‌లో ఐదు బెడ్‌రూమ్‌లతో పాటు, భోజనాలు, సమావేశాల కోసం సుమారు 100 మంది కూర్చునేందుకు వీలుగా ఏసీ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి సమయంలో బస చేస్తూ నదిలో ప్రశాంతంగా విహరించే ఈ సదుపాయం విజయవాడ పర్యాటకానికి సరికొత్త హంగులను అద్దనుంది. అలాగే దుబాయ్, లండన్, గోవా నగరాల తరహాలో పెద్ద ఎత్తున పార్టీలు, డిన్నర్‌లు నిర్వహించుకునేలా మరో సరికొత్త క్రూయిజ్‌ను తీసుకువస్తున్నారు. రెండు ఏసీ డెక్‌లతో సుమారు 200 మంది సామర్థ్యంతో ఈ పార్టీ-అండ్-డిన్నర్ క్రూయిజ్ రూపుదిద్దుకుంటోంది. పుట్టినరోజు వేడుకలు, కుటుంబ వేడుకలు, కార్పొరేట్ మీటింగ్స్, ఇతర ప్రత్యేక సందర్భాలను వాటర్ పైనే జరుపుకునేలా ఇది ఉపయోగపడనుంది. ఇప్పటికే కృష్ణా నదిలో ఒక హౌస్‌బోట్ అందుబాటులో ఉండగా, అది ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా, ప్రైవేట్ పార్టీలకు వేదికగా మారుతోంది. ఇప్పుడు భవానీ ద్వీపం, పవిత్ర సంగమం వంటి ప్రముఖ ప్రదేశాలతో పాటు ఈ లగ్జరీ హౌస్‌బోట్లు, భారీ క్రూయిజ్‌లు కూడా తోడైతే విజయవాడలో రివర్ టూరిజం మరింత కళకళలాడుతుందని పర్యాటక శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق