తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు కల్తీ ఆహారం, వసతుల లేమితో సతమతమవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నెలకొన్న దుస్థితిని సమీక్షించకపోవడం సిగ్గుచేటని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పురుగుల అన్నం తినలేక రోడ్డెక్కడం, ఉస్మానియా విద్యార్థులు నాణ్యమైన భోజనం కోసం ఆందోళనలు చేస్తున్నా పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. విద్యార్థుల కడుపు మాడుస్తూ, వారిని రోడ్లపైకి తెస్తున్న ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అని ప్రశ్నిస్తూ, తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాలి మోటార్లలో తిరగడానికి, ఢిల్లీ పర్యటనలకు ఉన్న సమయం, పేద విద్యార్థుల కష్టాలు తెలుసుకోవడానికి లేకపోవడం దురదృష్టకరమని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి 62 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం, రాష్ట్రానికి సాధించింది శూన్యమని మొన్నటి కేంద్ర బడ్జెట్ ద్వారా స్పష్టమైందన్నారు. గత ప్రభుత్వం పూర్తి చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప, ఈ రెండున్నరేళ్లలో కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు. ఉన్న గురుకులాలను గాలికి వదిలేసి, కమీషన్ల కోసమే 'యంగ్ ఇండియా స్కూల్స్' అంటూ కొత్త నాటకాలకు తెరలేపారని ఆరోపించారు. 'కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తానన్నట్లు' ప్రభుత్వ తీరు ఉందని హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పిల్లలకు కనీసం పురుగుల్లేని అన్నం పెట్టలేని వారు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కల్పిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హార్వర్డ్ వంటి యూనివర్సిటీలకు వెళ్లి వచ్చినా, విద్య పట్ల సీఎంకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రగల్భాలు పలకడం, ప్రతిపక్షాలను తిట్టడం మాని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ వసతి గృహాల్లో వరుసగా ఆహారం కలుషితమవుతున్న ఘటనలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులనూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
'కూట్లో రాయి తీయలేనోడు - ఏట్లో రాయి తీస్తానన్నట్లు' ఉంది ప్రభుత్వ తీరు !
الخميس، 12 فبراير 2026
'He who cannot remove a stone from a pot - he will remove a stone from a pot' is like saying Harish Rao criticized the government's attitude in an X-platform telangana
ليست هناك تعليقات:
إرسال تعليق