విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం
الثلاثاء، 22 سبتمبر 2026
Andhra Pradesh Depression Set to Cross Coast Between Visakhapatnam and Gopalpur India Meteorological Department Odisha
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని డీప్ డిప్రెషన్‌గా దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక, వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం సముద్ర పరిస్థితులు కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ స్పష్టం చేసింది. వాయుగుండం నేపథ్యంలో అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రానున్న మూడు రోజులు అత్యంత కీలకమని, ప్రభావిత జిల్లాల యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉండాలని సూచించారు. ముందస్తు సహాయక చర్యల కోసం అవసరమైన ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మత్స్యకారులు బోట్లు, వలలను సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరాన్ని బట్టి రోడ్డు రవాణా, హెలికాప్టర్ సేవలను నియంత్రించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా ట్రాలర్లు, బోట్లు, చిన్న నౌకల రాకపోకలకు ఇబ్బందులు, రైల్వే సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని అధికారులు సూచించారు. వాయుగుండం కదలికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అధికారిక హెచ్చరికలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ليست هناك تعليقات:
إرسال تعليق