ఇజ్రాయెల్ సైన్యం దాడిలో హమాస్ ఆర్థిక వ్యవహారాల విభాగాధిపతి మహ్మద్ అబూ అల్వాన్ మృతి
Wednesday, September 23, 2026
Hamas Finance Chief Mohammed Abu Alwan Killed in Israeli Army Strike international sraeli Prime Minister's Office confirmed
హమాస్ ఆర్థిక వ్యవహారాల విభాగాధిపతి మహ్మద్ అబూ అల్వాన్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, అంతర్గత భద్రతా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ టార్గెటెడ్ ఆపరేషన్‌లో అల్వాన్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనలో ధ్రువీకరించింది. ఈ విజయవంతమైన దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ భద్రతా బలగాలను అభినందించారు. గాజాలో హమాస్ ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు తమ సైనిక చర్యలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. హమాస్ ఉగ్రవాదులు తమ బలాన్ని మళ్లీ పుంజుకోకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని నెతన్యాహు, కాట్జ్ హెచ్చరించారు. హమాస్ కమాండర్లు, కార్యకర్తలను ఏరివేయడంతో పాటు వారికి నిధులు సమకూరుస్తున్న ఆర్థిక వనరులను పూర్తిగా నాశనం చేస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 7 నాటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని, తమ పౌరుల భద్రతతో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. డ్రోన్లు, బెలూన్లు, గాలిపటాల ద్వారా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడితే దాడులను మరింత ముమ్మరం చేస్తామని సైన్యం హెచ్చరించింది. మరోవైపు, ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే చిన్నపిల్లలు ఎగురవేసే గాలిపటాలను బూచిగా చూపిస్తోందని హమాస్ ఆరోపించింది. ఇది ముమ్మాటికీ పాలస్తీనా పిల్లలను భయాందోళనలకు గురిచేసే కుట్రేనని హమాస్ అధికార ప్రతినిధి హజెమ్ ఖాసిమ్ పేర్కొన్నారు. గాజాలో ఉద్రిక్తతలను పెంచేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని, కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ను నిలువరించాలని అమెరికా, మధ్యవర్తిత్వ దేశాలు మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆయన కోరారు.
No comments:
Post a Comment