కృత్రిమ మేధ విస్తృతి పెరిగిన కొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి దాదాపు నిలిచిపోతోందని, డేటా సెంటర్లు, ఏఐ సాధనాల నిర్వహణ వ్యయాలు అదుపు తప్పిపోతున్నాయని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిశ్చితమైన గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సవాలుతో కూడుకుందని పేర్కొన్నారు. సాధారణంగా కొత్త ఉద్యోగుల నియామకం, జీతభత్యాల కోసం కేటాయించే బడ్జెట్‌ను ఐటీ కంపెనీలు ఇప్పుడు ఏఐ సాంకేతికత, డేటా సెంటర్ల మౌలిక వసతుల వైపే మళ్లించాల్సి వస్తోందని శ్రీధర్ వేంబు స్పష్టం చేశారు. 'మా సంస్థ జోహోతో సహా ఏ కంపెనీ కూడా ప్రస్తుతానికి లేఆఫ్‌లు ప్రకటించకపోయినప్పటికీ గత కొన్నేళ్లుగా కొత్త ఉద్యోగాల నియామకాలను మాత్రం చేపట్టడం లేదు. సర్వర్లు, మెమరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల డేటా సెంటర్ల నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. ఈ వ్యయాలను నియంత్రించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ చాలా అంశాలు మన చేతుల్లో లేవు' అని వేంబు వెల్లడించారు. ఏఐ సాధనాల సాయంతో కోడింగ్ చేయడం, కొత్త సాఫ్ట్‌వేర్‌లను తయారు చేయడం వేగవంతమైనప్పటికీ ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌కు ఇంకా అదనపు వసతులు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఇతర కమోడిటీ పరిశ్రమలాగే సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా ఇకపై నాణ్యత, విశ్వసనీయత, బ్రాండ్ విలువలే ప్రధానంగా మారతాయన్నారు. దీనివల్ల వృద్ధి రేటు నెమ్మదిస్తుందని విశ్లేషించారు. బహుళజాతి కార్పొరేట్ క్లయింట్లు సైతం తమ ఐటీ బడ్జెట్లను తగ్గించుకుని ఏఐ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఆటోమేషన్ పెరగడం వల్ల భారీ ఉత్పత్తులు సాధించే మాన్యుఫ్యాక్చరింగ్ రంగం కూడా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలను సృష్టించలేకపోతోందని వేంబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ, ఆటోమేషన్ వల్ల వస్తువుల తయారీ వ్యయం తగ్గి ఉత్పత్తులు చవకగా లభించినప్పటికీ వాటిని కొనుగోలు చేసేంత ఆదాయం ప్రజల చేతిలో ఉండేలా ఆర్థిక వ్యవస్థను ఎలా తీర్చిదిద్దాలనేదే ఇక్కడ ఉత్పన్నమయ్యే అసలు ప్రశ్న అని పేర్కొన్నారు. ఈ సవాలుకు సమాధానంగా కొందరు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం లేదా సంక్షేమ పథకాలను ఒక మార్గంగా చూస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రతిపాదనలపై రాజకీయ ఒత్తిడి మరింత పెరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు.
దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సవాలుతో కూడుకుంది : భారీగా పెరిగిన డేటా సెంటర్ల నిర్వహణ వ్యయం
الاثنين، 3 أغسطس 2026
Creating employment opportunities for the country's youth is a challenge Data center operating costs have surged science technology Zoho founder Sridhar Vembu
ليست هناك تعليقات:
إرسال تعليق