Ad Code

భారీగా కుప్పకూలుతోన్న స్పేస్ఎక్స్ షేర్లు

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఓగా చరిత్ర సృష్టించిన కొద్ది రోజులకే ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్‌ భారీ పతనాన్ని చూస్తోంది. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 600 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. ఐపీఓ తర్వాత వచ్చిన భారీ ఉత్సాహం తగ్గడంతో పెట్టుబడిదారులు కంపెనీ ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఈ నెల ప్రారంభంలో నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన స్పేస్ఎక్స్ షేర్లకు పెట్టుబడిదారుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఐపీఓతర్వాత కంపెనీ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరువైంది. కేవలం రాకెట్లు లేదా ఉపగ్రహాల వ్యాపారంపై పెట్టుబడిగా కాకుండా ఎలాన్ మస్క్ భవిష్యత్ ఆలోచనలపై, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , స్పేస్ టెక్నాలజీ, భవిష్యత్ కంప్యూటింగ్ రంగాలపై పెట్టుబడిదారులు నమ్మకం ఉంచారు. స్పేస్ఎక్స్ కూడా తనను కేవలం స్పేస్ కంపెనీగా కాకుండా AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కీలక సంస్థగా ప్రొజెక్ట్ చేసింది. డేటా సెంటర్లు, కంప్యూటింగ్ శక్తి, AI రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పెట్టుబడిదారుల ఆసక్తిని మరింత పెంచింది. షేర్ ధర పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటి స్పేస్ఎక్స్ కొత్తగా బాండ్‌ల ద్వారా నిధులు సమీకరించనున్నట్లు ప్రకటించడం. సాధారణంగా పెద్ద కంపెనీలు అప్పులు తీసుకోవడం కొత్త విషయం కాదు. కానీ SpaceX తన వద్ద ఇప్పటికే 100 బిలియన్ డాలర్లకు పైగా నగదు నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో పెట్టుబడిదారులలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. అంత డబ్బు చేతిలో ఉంటే కొత్త అప్పులు ఎందుకు? కంపెనీకి మరింత నిధులు అవసరమయ్యేంత పెద్ద ఖర్చులు ఏమిటి? భవిష్యత్ ప్రాజెక్టులు ఎంత భారీగా ఉండబోతున్నాయి? కంపెనీ ఈ నిధులను సాధారణ వ్యాపార అవసరాలు, పాత రుణాల చెల్లింపుల కోసం ఉపయోగిస్తామని తెలిపినా మార్కెట్ మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది. స్పేస్ఎక్స్ ఆదాయం 30 శాతానికి పైగా పెరిగినప్పటికీ కంపెనీ ఇంకా భారీ నష్టాల్లోనే కొనసాగుతోంది. AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీ ఖర్చులు, కొత్త డేటా సెంటర్ల నిర్మాణం, స్టార్ షిప్  ప్రాజెక్ట్ అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాలపై భారీ పెట్టుబడులు వంటివి వీటికి కారణాలుగా చెబుతున్నారు. పెట్టుబడిదారులు సాధారణంగా నష్టాలను సహిస్తారు. కానీ దానికి బదులుగా అసాధారణ వృద్ధి కనిపించాలి. ఐపీఓ తర్వాత కంపెనీ విలువ అమితంగా పెరగడంతో, ప్రస్తుతం ఉన్న ఆదాయంతో పోలిస్తే ఆ విలువ చాలా ఎక్కువగా ఉందా అనే చర్చ మొదలైంది. ఒక దశలో స్పేస్ఎక్స్ మార్కెట్ విలువ అమెజాన్‌ను కూడా అధిగమించే స్థాయికి చేరింది. కానీ ఆదాయ పరంగా చూస్తే అది ఇంకా పెద్ద టెక్ దిగ్గజాల కంటే చాలా వెనుకబడి ఉంది. గత ఏడాది కాలంగా AI అనే పేరు ఉన్న దాదాపు ప్రతి కంపెనీలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. దీంతో టెక్నాలజీ కంపెనీల విలువలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు పెట్టుబడిదారులు రెండు రకాల కంపెనీలను వేరు చేసి చూస్తున్నారు. ప్రస్తుతం AI ద్వారా లాభాలు ఆర్జిస్తున్న సంస్థలు, భవిష్యత్‌లో లాభాలు వస్తాయని చెబుతున్న సంస్థలు. స్పేస్ఎక్స్  రెండో వర్గానికి చెందుతుంది. కంపెనీ చేపడుతున్న అనేక ప్రాజెక్టులు పూర్తి ఫలితాలు ఇవ్వడానికి ఇంకా సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది. దీంతో మార్కెట్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. భారీ పతనం వచ్చినప్పటికీ స్పేస్ఎక్స్ పరిస్థితి ప్రమాదకర స్థాయిలో లేదు. ప్రస్తుతం కూడా కంపెనీ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు పైగానే ఉంది. ఐపీఓ ధర కంటే షేర్లు ఇంకా ఎక్కువ స్థాయిలోనే ట్రేడవుతున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu