కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్  239వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్  డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ఖరారు చేస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడేళ్లుగా ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 8.25 శాతం వద్దే నిలకడగా కొనసాగిస్తుండటం గమనార్హం. గత ఫిబ్రవరిలో 2024-25 సంవత్సరానికి ఇదే రేటును ఖరారు చేయగా, అంతకుముందు 2023-24లో 8.15 శాతం నుంచి 8.25 శాతానికి స్వల్పంగా పెంచింది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం మళ్లీ పాత గరిష్ట స్థాయిల దిశగా వడ్డీ రేటు ప్రయాణించడం విశేషం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి అయిన 8.10 శాతానికి పడిపోయింది. అంతకుముందు 1977-78లో మాత్రమే అత్యల్పంగా 8 శాతం వడ్డీ నమోదైంది. సీబీటీ ఆమోదించిన ఈ 8.25 శాతం వడ్డీ రేటు ప్రతిపాదన ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనకు వెళ్తుంది. ఆర్థిక శాఖ తుది అనుమతి లభించిన వెంటనే ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సుమారు ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లోకి వడ్డీ సొమ్ము జమ అవుతుంది. 

Post a Comment

Previous Post Next Post