భారత్-అమెరికా ఒప్పందం దేశంలోని ఐదు కోట్ల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్ రంగాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత వస్త్ర పరిశ్రమ కుదేలు కావడం ఖాయమని, ఇది దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టడమేనని ఆయన మండిపడ్డారు. అమెరికాలో బంగ్లాదేశ్ వస్త్రాలపై సున్నా శాతం పన్ను విధిస్తుంటే, భారత ఉత్పత్తులపై మాత్రం 18 శాతం భారీ పన్ను విధిస్తున్నారని రాహుల్ వివరించారు. ఈ వ్యత్యాసం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగ్లాదేశ్‌తో పోటీ పడలేక భారత టెక్స్‌టైల్ పరిశ్రమ కనుమరుగవుతుందని హెచ్చరించారు. అమెరికా పత్తిని దిగుమతి చేసుకుంటే భారత్‌కు కూడా రాయితీలు లభిస్తాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధమని, దేశాన్ని తప్పుదోవ పట్టించవద్దని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అలాగే అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం భారత పత్తి రైతుల నడ్డి విరుస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఇకపై భారత్ నుంచి పత్తిని కొనడం ఆపివేసి, నేరుగా అమెరికా నుంచే దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుందని, ఈ చేదు నిజం కేంద్ర మంత్రులకు కూడా తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవైపు పత్తి రైతులకు మార్కెట్ లేకుండా చేస్తూ, మరోవైపు వస్త్ర పరిశ్రమను దెబ్బతీస్తున్న ఈ ఒప్పందాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ గాంధీ విడుదల చేసిన తన వీడియోలో స్పష్టం చేశారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం : టెక్స్‌టైల్ రంగాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది : రాహుల్ గాంధీ వీడియో విడుదల
Telugu Lo Computer
0
Comments
Post a Comment