తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులకు సంబంధించి తన తరపు న్యాయవాది ఇప్పటికే స్పందించారని తెలిపారు. స్పీకర్‌కు వివరణ ఇస్తూ తన అడ్వకేట్ ఒక లేఖ రాశారని, అయితే ఆ లేఖలో ఏయే అంశాలను పొందుపరిచారనే విషయంపై తనకు పూర్తి అవగాహన లేదని క్లారిటీ ఇచ్చారు. తమ తరపున వివరణ పంపినప్పటికీ, స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి జవాబు రాలేదని తెలిపారు. విచారణ ప్రక్రియకు సంబంధించి తాము పంపిన వివరణపై స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లుగా దానం పేర్కొన్నారు. విచారణ నిమిత్తం తనను వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అన్నారు. తనను వ్యక్తిగతంగా రమ్మని ఎవరూ చెప్పలేదు, ప్రస్తుతానికి లీగల్ టీమ్ ఈ వ్యవహారాన్ని చూసుకుందని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని, వారి యాక్షన్‌కు తన రియాక్షన్ ఉంటుందని అన్నారు. తాను ఎన్నికలకు భయపడే వ్యక్తి కాదని దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. 

Post a Comment

Previous Post Next Post