దేశీయ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు చరిత్ర సృష్టించాయి. పెట్టుబడిదారుల దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తూ, ఎంసీఎక్స్ లో కిలో వెండి ధర తొలిసారిగా రూ.4 లక్షల మైలురాయిని దాటింది. ఉదయం 9:44 గంటల సమయంలో కిలో వెండి రూ.4,02,792 వద్ద ట్రేడవుతూ, గత ముగింపు ధరతో పోలిస్తే 4.5 శాతానికి పైగా లాభాన్ని నమోదు చేసింది. ఈ అకస్మాత్తు దూకుడు వెనుక అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో, ప్రపంచ మార్కెట్లలో సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లింపు మొదలైంది. ఈ నేపథ్యంలో వెండి వంటి విలువైన లోహాలపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అదే ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లలోనూ స్పష్టంగా కనిపించింది. గ్లోబల్ మార్కెట్‌లో వెండి ధర ఔన్సుకు 117 డాలర్లకు చేరుకుని, ఒక్కరోజులోనే సుమారు 3.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ ర్యాలీకి మరింత ఇంధనం అందించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలపై చేసిన హెచ్చరికలు మార్కెట్లను కలవరపెట్టాయి. చైనాతో ఒప్పందం కుదరకపోతే కెనడాపై భారీ సుంకాలు విధిస్తామని, అలాగే దక్షిణ కొరియా ఆటోలు, ఔషధాలు, కలపపై సుంకాలను 25 శాతానికి పెంచినట్లు ప్రకటించడం పెట్టుబడిదారులను రిస్క్ ఆస్తుల నుంచి దూరం చేసింది. ఈ అనిశ్చిత వాతావరణంలో వెండి మరోసారి 'సేఫ్ హెవెన్'గా మారింది.
0 Comments