వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డులుగా మారుస్తూ గెజిట్‌ విడుదల


ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 'వార్డు సచివాలయాల' పేరును ఇకపై 'స్వర్ణ వార్డు'లుగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు కేవలం సేవలు అందించడమే కాకుండా ఆ సేవల్లో అత్యున్నత నాణ్యత, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేయగా ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌ను కూడా విడుదల చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఈ మార్పుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ప్రభుత్వ రికార్డుల నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి బోర్డుల వరకు అన్ని చోట్లా 'స్వర్ణ వార్డు' అనే పేరు తక్షణమే అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో పట్టణాల్లోని సచివాలయాల బోర్డులు, అధికారిక పత్రాలు, ప్రభుత్వ రికార్డులు.. ఆన్‌లైన్ పోర్టల్స్ అన్నింటిలోనూ పాత పేరు స్థానంలో కొత్త పేరు చేరనుంది.


Post a Comment

0 Comments