భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ డిసెంబర్ 27న అధికారికంగా పదవీ విరమణ పొందారు. ఈ మేరకు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసింది. సునీతా విలియమ్స్ తన కెరీర్‌లో సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. ఆమె సాధించిన కొన్ని ప్రధాన మైలురాళ్లు ఉన్నాయి. ఆమె మూడు వేర్వేరు మిషన్ల ద్వారా అంతరిక్షంలో మొత్తం 608 రోజులు గడిపారు. నాసా వ్యోమగాములలో అత్యధిక కాలం అంతరిక్షంలో ఉన్న వారి జాబితాలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. ఆమె మొత్తం తొమ్మిదిసార్లు అంతరిక్షంలో నడిచారు. సుమారు 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి, ఒక మహిళా వ్యోమగామిగా అత్యధిక సమయం అంతరిక్షంలో గడిపిన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఉంటూనే మారథాన్ పూర్తి చేసిన ప్రపంచపు మొదటి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. డిసెంబర్ 9, 2006న తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ మిషన్‌లో నాలుగు స్పేస్ వాక్‌లు చేసి అప్పట్లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పారు. జూలై 14, 2012న 127 రోజుల మిషన్ కోసం వెళ్లారు. అక్కడ స్పేస్ స్టేషన్‌లో అమ్మోనియా లీకేజీని సరిచేయడంలో కీలక పాత్ర పోషించారు. జూన్ 2024లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా వెళ్లిన ఈ మిషన్ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. కేవలం 10 రోజులు ఉండాల్సిన ఆమె, దాదాపు తొమ్మిదిన్నర నెలలు అక్కడే గడిపి మార్చి 2025లో భూమికి చేరుకున్నారు. 60 ఏళ్ల సునీత విలియమ్స్ తన మూలాలు భారత్‌లోనే ఉన్నాయని ఎప్పుడూ గర్వంగా చెబుతుంటారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఝులాసన్ గ్రామానికి చెందినవారు. ఆయన వృత్తిరీత్యా న్యూరోఅనాటమిస్ట్. ఆమె తల్లి బోనీ పాండ్యా. సునీత అమెరికాలోని ఒహియోలో జన్మించినప్పటికీ, భారతీయ సంస్కృతి పట్ల ఆమెకు ఎంతో మక్కువ. "అంతరిక్షం నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. నాసాలో గడిపిన 27 ఏళ్ల కెరీర్ అద్భుతంగా సాగిందని సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. నాసా అడ్మినిస్ట్రేటర్లు సునీతను కొనియాడుతూ, ఆమె సాధించిన విజయాలు రాబోయే తరాలకు, ముఖ్యంగా కలలు కనే యువతకు పెద్ద స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
Post a Comment