తమిళనాడులో సెల్‌ఫోన్ ద్వారా యువతితో పరిచయం పెంచి, పురుషులను బుట్టలో వేసుకుని, వారిని అశ్లీల వీడియోలు తీసి డబ్బులు వసూలు చేస్తున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సేలం జిల్లా పూసారిపట్టికి చెందిన అలమేలు (25) అనే వివాహితకు, జనార్దనన్ (28), జనఅంశప్రియన్ (28) అనే అన్నదమ్ములతో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురూ కలిసి ఒక పథకం వేశారు. ఓమలూరు పరిసర ప్రాంతాల్లోని ప్రముఖుల ఫోన్ నంబర్లు సేకరించి, అలమేలుతో వారిని ప్రేమగా మాట్లాడించేవారు. మాటల వల వేసి తొలుత వారి వద్ద నుండి డబ్బులు తీసుకువారు. ఆ వ్యక్తులు తమ డబ్బులు తిరిగి అడగ్గా, అలమేలు వారిని నేరుగా రమ్మని పిలిచేది. ఆమె మాటలు నమ్మి వెళ్లిన వారిని ముఠా సభ్యులు ఇంట్లో బంధించి, బట్టలు ఊడదీసి అశ్లీల వీడియోలు తీసేవారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ దందాలో ఎంతోమంది చిక్కుకున్నారు. ఓమలూరు పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న భూపతి (32) కూడా ఈ ముఠా వలలో చిక్కి నగదు, నగలు కోల్పోయారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠా గుట్టురట్టు చేశారు. ఈ నేరంలో ప్రధాన సూత్రధారులైన అన్నదమ్ములు జనార్దనన్, జనఅంశప్రియన్ తో పాటు నకిలీ లాయర్ అవతారమెత్తిన అలమేలు సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో వీరు సబ్ ఇన్‌స్పెక్టర్, బస్సు డ్రైవర్ సహా తొమ్మిది మందిని మోసం చేసినట్లు ఆధారాలు లభించాయి.
0 Comments