సీఎం చంద్రబాబుతో దుబాయిలో ప్రవాసాంధ్రులు సమావేశం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమతో సమావేశం కావడం పట్ల దుబాయి ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుబాయితో ఆయనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్బంగా వారు గుర్తు చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పలుమార్లు దుబాయి వచ్చినా స్థానిక ప్రవాసాంధ్రులతో సీఎం చంద్రబాబు కలుసుకోలేదన్నారు. అయితే ఆ లోటు అంతా తాజాగా తమతో సీఎం సమావేశం కావడంతో తీరిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో సమావేశం కావడం ఒక తీపి గుర్తు అని పేర్కొన్నారు. సాధారణంగా దుబాయిలోని ప్రవాసాంధ్రులు రాజకీయ సభలకు దూరంగా ఉంటారని, కానీ సీఎం చంద్రబాబుతో సమావేశానికి వారంతా పోటెత్తారని తెలిపారు. గతంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశాలు జరిగాయని, ఈ సందర్బంగా వారిని స్థానికులు కలవడం భద్రతా దృష్ట్యా అసాధ్యమని తెలిపారు. కానీ సీఎం చంద్రబాబు చుట్టు భద్రతా వలయం ఉన్నా ఆయన మాత్రం ప్రవాసాంధ్రులతో మమేకమ్యాయరని వివరించారు. సీఎం చంద్రబాబుతో ప్రవాసాంధ్రులు వరుసగా ఫొటోలు దిగారన్నారు. దాదాపు 5 గంటల పాటు ఆయన వేదిక మీద నిలబడి పలువురితో మాట్లాడారని తెలిపారు. ఆ జాబితాలో వేమూరి హంశ్ (9)తోపాటు కాకినాడలో జన్మించి దుబాయిలో స్ధిరపడ్డ 92 ఏళ్ళ ఫాతిమా కూడా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వేమూరి హంశ్ సంధించిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారన్నారు. అలాగే 1965 భారత - పాకిస్థాన్ యుద్ధంలో జాతికి తన బంగారాన్ని విరాళంగా ఇచ్చిన అలనాటి కాకినాడ లేడీస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఫాతీమా ఆంధ్రప్రదేశ్‌ను దుబాయి తరహా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబును ఆశ్వీర్వదించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు.. వేదిక దిగి వీల్ చెయిర్‌లో ఉన్న ఫాతీమా బీ వద్దకు వెళ్లి మాట్లాడారు. దుబాయిలో ప్రవాసాంధ్ర ప్రముఖుడు జాఫర్ అలీ తల్లి ఈ ఫాతీమా. ఈ సమావేశానికి సౌదీ అరేబియా నుంచి గడ్డం శిల్పా, చెన్నుపాటి అక్షితలను సీఎం చంద్రబాబు అప్యాయంగా పలకరించారు. గతంలో విజయవాడలో మిమ్మల్ని కలిశానంటూ వారితో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో సీఎం జ్ఞాపక శక్తికి వారు ముగ్ధులయ్యారు. ఈ సమావేశానికి సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఒమాన్ దేశాల నుంచి భారీగా ప్రవాసాంధ్రులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకొంది. ఈ సభ విజయవంతం కావడంలో తెలుగుదేశం గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్వర్యంలో పార్టీ స్ధానిక నాయకులు ముక్కు తులసీ కుమార్, విశ్వేశ్వరావు, వాసురెడ్డి, రాజ రవికిరణ్, బాషా, స్ధానిక ప్రముఖులు సునీల్ బొయపాటితోపాటు మంగళగిరిలో ఎపీ ఎన్నార్టీ ప్రవాసీ సంస్థ, విజయవాడలో పార్టీ ప్రముఖులు వేమూరి రవి, బుచ్చిరాం ప్రసాద్ సైతం భాగస్వామ్యులయ్యారు. ఈ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయిందంటూ ప్రవాసాంధ్రులు పేర్కొంటున్నారు.

Post a Comment

0 Comments