నూతన సంవత్సరం వేళ బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టోవంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు రికార్డు స్థాయి విక్రయాలు నమోదు చేశాయి. ఈ విషయాన్ని క్విక్ కామర్స్ సంస్థలు 'ఎక్స్' వేదికగా వెల్లడించాయి. గతేడాది డిసెంబర్ 31తో పోలిస్తే 2024 డిసెంబర్ 31న బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వేదికగా ఆర్డర్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. క్విక్ కామర్స్ విభాగం పుంజుకుంటున్న తరుణంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ బ్లింకిట్ తాజాగా లార్జ్ ఆర్డర్ల కోసం ఫ్లీట్ సేవల్ని ప్రారంభించింది. ఢిల్లీ, గురుగ్రామ్‌లో ఫ్లీట్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన్నట్లు బ్లింకిట్ సీఈఓ ఆల్బీందర్ దిండ్సా 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. దీంతో పాటు ఎక్కువగా ఏయే వస్తువులను ఎన్నేసి ఆర్డర్ చేశారో దానికి సంబంధించిన డేటాను కూడా పోస్ట్ చేశాడు. 2,34,512 ఆలూ భుజియా, 45,531 మినరల్ వాటర్ బాటిళ్లు, 2,434 ఈనో పాకెట్లు డెలివరీ చేసినట్లు తెలిపారు. దీపావళి, మదర్స్‌డే సమయంలో ఇన్‌స్టామార్ట్ వేదికగా గతేడాది రికార్డు స్థాయిలో ఆర్డర్లు నమోదయ్యాయి. న్యూఇయర్ ముందు రోజు కొత్త రికార్డు నమోదైంది. స్నాక్స్ కోసం ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయని ఇన్‌స్టామార్ట్ తెలిపింది. ఇక ఫుడ్ డెలివరీలు, క్విక్ కామర్స్ ఆర్డర్లలో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలిచింది. డైన్-ఔట్ సర్వీసులను బుక్ చేసుకోవడంలోనూ బెంగళూరు వాసులే ముందంజలో ఉన్నారు. ఇక క్విక్ డెలివరీల విషయానికొస్తే.. బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, చాక్‌లెట్లు అధికంగా కొనుగోలు చేశారు. కొత్త ఏడాదిలో క్విక్ కామర్స్ విభాగం సంప్రదాయ ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ లకు పోటీ ఇవ్వనుందని జెప్టో సహ వ్యవస్థాపకుడు అదిత్ పలిచా అన్నాడు. ఈ ఏడాదిలో మెరుగై వృద్ధితో దూసుకెళ్లనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ- కామర్స్ ప్లాట్‌ఫామ్ స్థాయికి క్విక్ కామర్స్ చేరనుందన్నారు. గతేడాదితో పోలిస్తే జెప్టో 200 శాతం వృద్ధి చెందిందని, గంటకు లక్షలాది ఆర్డర్లను నమోదు చేసుకుంటోందని తెలిపారు.
0 Comments