అరెస్ట్‌ చేస్తే జైలుకెళ్లి నాలుగు సినిమా కథలు రాసుకుంటా !


కవేళ తనని అరెస్టు చేస్తే జైలుకు వెళ్తానని, అక్కడ ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా కథలు రాసుకుంటానని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై అసహనం వ్యక్తం చేశారు. ''సోషల్‌మీడియాను రెగ్యులరైజ్‌ చేయడం కష్టం. చట్టంలో నాకున్న అవకాశాలను బట్టి పోలీసులకు సమాధానమిచ్చా. నేను హైదరాబాద్‌లో ఉన్నాను. లైవ్‌లో ఇంటర్వ్యూలు ఇస్తున్నా. పోలీసులు ఇంకా నన్ను పట్టుకోలేదని చాలా మంది అంటున్నారు. నన్ను అరెస్టు చేస్తే జైలుకెళ్తా, నాలుగు సినిమా కథలు రాసుకుంటా. గత కొన్నేళ్లుగా నా ఎక్స్ అకౌంట్‌లో వేల పోస్టులు పెట్టాను. వాటిలో కొన్నింటి వల్ల నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏడాది తర్వాత స్పందించారు. సంవత్సరం తర్వాత నాలుగైదుగురు ఒకేసారి మేల్కొనడం ఏంటీ? వివిధ జిల్లాల్లో నాపై కేసులు పెట్టారు. నాకున్న పనులు, కమిట్‌మెంట్స్‌ వల్ల నేను హాజరుకాలేనని కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నాను. నన్ను అరెస్టు చేస్తారని పోలీసులతో కలిసి కొన్ని మీడియా సంస్థలు నా డెన్‌కు (వర్మ ఇల్లు) వచ్చాయి. నేను అక్కడ లేకపోవడంతో పరారీలో ఉన్నాడని, మంచం కింద దాక్కున్నాడని కొన్ని మీడియా సంస్థలు కథనాలు అల్లాయి. నా కోసం కేరళ, కోయంబత్తూరులో పోలీసులు జల్లెడ పడుతున్నారని రాశారు. నా అరెస్టు గురించి ఏ పోలీసు అధికారి అధికారికంగా చెప్పలేదు కదా! లేని న్యూస్‌ను కొందరు కావాలని సృష్టిస్తున్నారు, నా విషయంలోనూ అదే జరిగింది. సోషల్ మీడియాలో అతి చేయొద్దని అంటున్నారు. అది మీరెలా చెబుతారు. ఒక కార్టూన్ పోస్టును అనే రకాల కోణల్లో ఆపాదించుకోవచ్చు. నన్ను కోట్‌ చేస్తూ ప్రధాన మీడియా సంస్థలు పోస్టులు కూడా పెడుతున్నాయి. నేను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెబుతున్నా, 'పరారీలో ఉన్నాడు' అంటారు. పోలీసులు ఇంకా వర్మను ఎందుకు పట్టుకోవడం లేదు? ప్రభుత్వం మారినా పోలీసులు వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని ప్రచారం చేశారు. ప్రకాశ్‌రాజ్ , నాగార్జున నన్ను దాచిపెట్టారని మీడియా ప్రచారం చేసింది. పోలీసుల కంటే మీడియానే డిటెక్టివ్‌గా మారింది. కార్టూన్ అనేది వ్యంగ్యంగా చెప్పే ఒక అంశం. నా గురించి ఎన్నో రకాలుగా అసభ్య పదజాలంతో తిడుతూ మీమ్స్ పెడతారు. అమెరికా లాంటి దేశం కూడా మీమ్స్ ను నియంత్రించలేకపోయింది. సోషల్‌మీడియా వచ్చిన తర్వాత అది ఇంకా జటిలమైంది. ప్రతి మనిషికి వేర్వేరు ఆలోచనలు ఉంటాయి. అవి అందరికీ వర్తిస్తాయి'' అని వర్మ అన్నారు.

Post a Comment

0 Comments