విభజన అంశాలపై ముగిసిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌ల భేటీ!


ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల కమిటీ సమావేశం ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో ఉన్నతాధికారుల కమిటీ దాదాపు రెండు గంటల పాటు సమావేశమై మూడు అంశాలపై అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. విద్యుత్‌ బకాయిల అంశంపై పంచాయితీ మాత్రం ఎటూ తేలలేదు. రూ.861 కోట్ల మేర లేబర్ సెస్‌ను ఏపీ - తెలంగాణల మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. పన్నులు పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడినట్లు సమాచారం. 9, 10 షెడ్యూల్‌ సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాల అంశమూ తేలలేదు. ఉద్యోగుల మార్పిడి పైనా సీఎస్‌ల కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఎక్సైజ్ శాఖకు తెలంగాణ చెల్లించిన రూ.81 కోట్ల బకాయిల అంశం పరిష్కారమైంది. అదనంగా ఇచ్చిన రూ.81 కోట్లు తిరిగి చెల్లించినట్లు ఏపీ తెలిపింది. డ్రగ్స్‌ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయానికి వచ్చారు. మరో రెండు అంశాలపైనా సీఎస్‌ల కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. విభజన అంశాలపై చర్చించేందుకు మరోసారి భేటీ కావాలని సీఎస్‌లు నిర్ణయించారు.

Post a Comment

0 Comments