మంత్రి నారా లోకేష్ ను కుటుంబంతో సహా కలిసిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు !


ఆంధ్రప్రదేశ్ లో విధి నిర్వహణలో ఉండగా 'దేవర' సినిమాలోని పాటకు స్టెప్పులు వేసి సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దుచేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన లోకేశ్ ను కుటుంబంతో సహా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 24న బస్సు రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తుండగా మార్గమధ్యంలో కర్రల లోడ్ ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావడం, బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో బస్సును నిలిపివేశారు. ఈ లోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా కాసేపు 'దేవర' సినిమాలోని పాటకు డ్యాన్స్ వేశాడు. ఇది కాస్తా ఓ యువకుడు వీడియో తీయడంతో వైరల్ అయింది. సోషల్ మీడియాలో డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ చూసి లోకేశ్ కూడా మెచ్చుకున్నారు. అయితే, ఈలోగానే నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో లోవరాజును అధికారులు సస్పెండ్ చేశారు. ఇది కాస్తా లోకేశ్ దృష్టికి రావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments