Ad Code

తిరుమల్లో అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు !


తిరుమలలో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాల ప్రివిలేజ్‌గా ఇవ్వాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో అమల్లోకి వచ్చింది. ఈ మేరకు టీటీడీ ప్రొసీడింగ్స్ కూడా జారీ చేసింది. 2008లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని స్వర్ణమయం చేయాలని టీటీడీ అప్పట్లో సంకల్పించింది. అయితే ఈ అంశం అప్పట్లో వివాదాస్పదం కావడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్ని అనివార్య కారణాలను చూపుతూ టీటీడీ ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకాన్ని నిలిపివేయగా అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆ స్కీం ఆగిపోవడం, ప్రస్తుతం అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ధర్మకర్తల మండలి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి చెందిన దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు సవరించిన ప్రివిలేజెస్ అందుబాటులోకి వచ్చాయి. అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు ఏడాదిలో మూడు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనుంది. రూ.2,500/- టారిఫ్‌లో ఏడాదికి మూడు రోజులు తిరుమలలో టీటీడీ వసతి కల్పించనుంది. ఏడాదికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందించనుంది. దాతల దర్శన సమయంలో ఏడాదికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ కూడా బహుమానంగా అందిస్తారు. దాత మొదటిసారి దర్శనానికి వచ్చిన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం బహుమానంగా టీటీడీ ఇవ్వనుంది. ఏడాదికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు ఇవ్వనున్నది. ఇది విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 ఏళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu