ఆర్జీ కర్ వైద్యకళాశాలలో నిరసన చేపడుతున్న జూనియర్ వైద్యులకు మద్దతుగా సీనియర్ వైద్యులు మూకుమ్మడిగా చేసిన రాజీనామాలు చెల్లుబాటు కావని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. జూనియర్ వైద్యులకు మద్దతుగా సుమారు 200 మంది వైద్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, అవన్నీ చట్టపరంగా చెల్లుబాటు కావని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అలాపన్ బందోపాధ్యాయ్ మీడియాకు వెల్లడించారు. సర్వీసు నిబంధనలకు అనుగుణంగా రాజీనామా చేయాల్సి ఉంటుందని, ప్రత్యేక ఫార్మాట్‌లో ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుందని చెప్పారు. ''ఇటీవల సీనియర్ వైద్యుల రాజీనామాపై గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు కొన్ని లేఖలు వచ్చాయి. వాటిపై రాజీనామా చేసిన వారి హోదాగానీ, ఇతర వివరాలు కానీ లేవు. వాటి ఆధారంగా రాజీనామా చేస్తున్నట్లు పరిగణించలేం. రాజీనామా అనేది ఉద్యోగికి, యజమానికి మధ్య సర్వీసు నిబంధనల ప్రకారం జరగాలి. లేదంటే చట్టప్రకారం అది చెల్లుబాటు కాదు. అందువల్ల ఈ రాజీనామాలను పరిగణనలోకి తీసుకోలేం'' అని బందోపాధ్యాయ్ తెలిపారు. మరోవైపు ఆర్జీ కర్ వైద్య కళాశాల విద్యార్థిని హత్యాచారానికి నిరసనగా నిరాహార దీక్ష చేపడుతున్న జూనియర్ వైద్యుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటి వరకు 8 మంది దీక్ష చేపడుతుండగా.. శనివారం మరో ఇద్దరు వచ్చి చేరారు.
0 Comments