చెన్నైకి చెందిన టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ సంస్థ 28 మంది ఉద్యోగులకు కార్లు, 29 మంది ఉద్యోగులకు మోటార్ సైకిళ్లు అందించింది. కార్లలో హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ, మెర్స్డెస్ బెంజ్ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. కంపెనీ విజయంలో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగులను గుర్తించడంలో భాగంగా వీటిని అందించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ తెలిపారు. ఉద్యోగులే తమకు విలువైన ఆస్తి అని పేర్కొన్నారు. కంపెనీలో మొత్తం 180 మంది పనిచేస్తున్నారని చెప్పారు. వారిలో చాలా మందికి కారు, బైక్ కొనుగోలు చేయాలన్న ఆశ ఉంటుందని, ఆ కల నెరవేర్చేందుకు వీటిని బహుమానంగా అందించినట్లు చెప్పారు. కారు, బైక్ కొనుగోలుకు సంబంధించి కొంత సీలింగ్ నిర్దేశించామని చెప్పారు. కంపెనీ నిర్ణయించినది కాకుండా, ఇంకా మంచి వాహనం కొనుగోలు చేయాలని ఉద్యోగికి అనిపిస్తే మిగిలిన మొత్తం చెల్లించి కొనుగోలు చేసుకునే వెసులుబాటును వారికి కల్పించినట్లు చెప్పారు. వివాహ వేడుకకు సాయం కింద రూ.50వేలు చెల్లించే వాళ్లమని, ఈ ఏడాది నుంచి ఆ మొత్తాన్ని రూ.1లక్షకు పెంచుతున్నట్లు చెప్పారు.
0 Comments