గాజా పట్టీలో హమాస్ తరఫున అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావీ ముష్తాహా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ భద్రతా దళాలు ప్రకటించాయి. కొన్ని నెలల క్రితమే తాము జరిపిన దాడుల్లో అతడు చనిపోయినట్లు ఐడీఎఫ్, షిన్‌బెట్ తాజాగా ప్రకటించాయి.ముష్తాహాను లక్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ దళాలు మూడు నెలల క్రితం గాజా పట్టీలో దాడి చేశాయి. ఆ సమయంలో అతడితోపాటు హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్‌నాయకుడు సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ చీఫ్ సమి ఒదేహ్ ఉన్నారు. ఆ దాడిలో వారు ముగ్గురు చనిపోయినట్లు తాజాగా ఐడీఫ్‌కు ధ్రువీకరణ లభించింది. వీరంతా సొరంగాల్లో నక్కిన సమయంలో ఇజ్రాయెల్ దళాలకు కచ్చితమైన ఇంటెలిజెన్స్ లభించింది. దీంతో ఫైటర్ జెట్ల సాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సొరంగ మార్గం నాడు హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా, సీనియర్ హమాస్‌నేతలు దీర్ఘకాలం తలదాచుకోవడానికి వీలుగా నిర్మించారు. మరోవైపు హమాస్ మాత్రం వీరి మరణాలను ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. దీంతో ఆ మిలిటెంట్ సంస్థ కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినకుండా నష్టాలను దాస్తోందని ఇజ్రాయెల్ భావిస్తోంది. వాస్తవానికి రావీ ముష్తాహా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌కు రైట్‌హ్యాండ్‌గా భావిస్తారు. వీరిద్దరు కలిసి ఇజ్రాయెల్ జైల్లో సుదీర్ఘకాలం ఉన్నారు. ఆ తర్వాత వీరే హమాస్ జనరల్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ యుద్ధ సమయంలో గాజాలో ప్రజలను నియంత్రించడంలో ముష్తాహానే కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ గుర్తించింది. ఈ దెబ్బతో హమాస్ దళాల మోహరింపులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. దీంతో హమాస్ ప్రధాన నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిందని భావిస్తున్నారు. ఇప్పటికే యాహ్యా సిన్వార్ జాడ లేకుండా పోయిన విషయం తెలిసిందే.
Post a Comment