త్వరలో తాము రెజ్లింగ్ ఛాంపియన్స్ సూపర్ లీగ్‌ ను ఆవిష్కరిస్తామని రెజ్లర్లు సాక్షి మాలిక్‌, గీతా ఫొగాట్‌, అమన్ సహ్రావత్‌ తెలిపారు. వర్ధమాన క్రీడాకారుల కోసం దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే దీనికి జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ నుంచి మద్దతు కావాల్సి ఉంది. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేస్తూ గత ఏడాది దేశ రాజధాని దిల్లీలో నిరసన దిగిన కుస్తీ యోధుల్లో సాక్షి మాలిక్ కూడా ఉంది. వారిలో వినేశ్‌ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఫొగాట్‌కు హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి హస్తం పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. అయితే వారితో కలిసి సాక్షి రాజకీయాల్లో చేరలేదు. ఆమె 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో 58 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. 2012లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌లో 55 కేజీల విభాగంలో గీత కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఇటీవల జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో అమన్.. 57 కిలోల విభాగంలో ఉడుంపట్టు పట్టి కంచు మోగించాడు. ''సాక్షి, నేను చాలా కాలంగా ఈ లీగ్‌ని ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే ఇది తుది రూపు దాల్చనుంది. మేము ఇంకా సమాఖ్యతో మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం, సమాఖ్య మాకు మద్దతు ఇస్తే చాలా బాగుంటుంది. ఇది ఆటగాళ్లు మాత్రమే నిర్వహించే మొదటి లీగ్ అవుతుంది. ఇది ఆటగాళ్ల ప్రయోజనం కోసం చేస్తున్నాం. ఇది మాకు గర్వించదగ్గ క్షణం '' అని ఫొగాట్ వెల్లడించింది.

Post a Comment

Previous Post Next Post