ఆంధ్రప్రదేశ్ లోని వినుకొండలో జరిగిన ఘటన వ్యక్తిగత కక్షలతోనే హత్యఅని, రాజకీయం లేదని పోలీసులు చెప్పారు. ఆ ఇద్దరివీ పక్క పక్క ఇళ్లే. కలిసిమెలిసి తిరిగారు. రెండేళ్ల క్రితం మద్యం తాగుతుండగా జరిగిన ఓ చిన్న గొడవ కక్షలకు పురిగొల్పింది. ఇంటిపై దాడిచేసి కుటుంబసభ్యులను గాయపరచడమే కాకుండా కేసు పెట్టి జైలుకు పంపడంతో అతడు పగతో రగిలిపోయాడు. నాటి బాధితుడు పగతో రగిలి కాపు కాసి ప్రత్యర్థిని బుధవారం రాత్రి నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా నరికి చంపిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో సంచలనం సృష్టించింది. హతుడు షేక్ రషీద్ (25), నిందితుడు షేక్ జిలానీ ఇద్దరూ ఏడాది క్రితం వరకూ వైకాపాలోనే తిరిగారు. 2022లో మొహర్రం రోజు పాత పశువుల ఆసుపత్రి సమీపంలో మద్యం తాగుతూ రెండువర్గాలు బీరు సీసాలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో జిలానీ బీరు సీసాతో ఒకరిని పొడవడంతో అతని తల, గొంతుపై గాయాలయ్యాయి. దాని తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలానీ ఇంటిపై రషీద్ దాడికి పాల్పడ్డాడు. జిలానీ సోదరుడు జానీ, కుటుంబసభ్యులను కొట్టి అక్కడే ఉన్న బుల్లెట్ బండిని తగలబెట్టారు. దీనిపై జిలానీ ఫిర్యాదుచేసినా పోలీసులు చర్యలేమీ తీసుకోలేదు. కానీ అంతకుముందు బీరు సీసాతో పొడిచాడని జిలానీపై హత్యాయత్నం కేసు నమోదుచేసి.. జైలుకు పంపించారు. దీంతో రషీద్‌పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై నమోదైన కేసుల్లో జిలానీ పేరునూ చేర్చారు. పగ పెంచుకున్న జిలానీ.. బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటకు రాగానే కొబ్బరి బొండాల కత్తితో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణంగా నరికి చంపాడు.
0 Comments