భారతీయ డెవలపర్‌ల కోసం గూగుల్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గూగుల్ మ్యాప్స్ ఏపీఐ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 70 శాతం వరకు రేట్లలో కోత విధిస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఇటీవల బెంగళూరులో జరిగిన డెవలపర్ ఈవెంట్ గూగుల్ I/O కనెక్ట్ లో ఈ మేరకు వివరాలు వెల్లడించింది. దూసుకొస్తున్న ఓలా పోటీని తట్టుకోవడానికే గూగుల్ ఇలా చేయాల్సి వచ్చిందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ తో పనిచేసే డెవలపర్‌లకు ఓపెన్ ఇ-కామర్స్‌ను అభివృద్ధి చేయడం కోసం ఏకంగా 90 శాతం తగ్గింపును ఇస్తామని గూగుల్ తెలిపింది. కేవలం ధరలు తగ్గించడమే కాకుండా ఇండియన్స్‌కు మరో అవకాశం కల్పించింది. నిర్ధిష్ట ధరలు ప్రవేశపెట్టడంతో పాటు సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులను రూపాయల్లోనూ చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కొత్త ధరలు ఆగస్ట్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఓలా CEO భవిష్ అగర్వాల్ డెవలపర్‌లందరికీ ఓలా మ్యాప్స్‌కు ఏడాది పాటు ఉచిత యాక్సెస్‌ను ఇస్తున్నట్లు ప్రకటించిన వారం తర్వాత గూగుల్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా క్యాబ్స్ యాప్స్‌లోనూ గూగుల్‌కు బదులుగా తమ సొంత మ్యాప్స్ ఉపయోగిస్తామని, తద్వారా 100 కోట్లు ఆదా చేయనున్నట్లు భవిష్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలిపారు. డెవలపర్లు కూడా ఓలా మ్యాప్స్‌కు మారాలని పిలుపునిచ్చారు. గూగుల్ ధరలు తగ్గించడంపై ఓలా సీఈఓ వ్యగ్యంగా స్పందించారు. 'డియర్ గూగుల్, ఇప్పటికే ఆలస్యం అయింది. గూగుల్ మ్యాప్స్‌ను డెవలపర్లు వీడుతుండటంతో ధరల తగ్గింపు, రూపాయల్లో చెల్లింపులకు అంగీకరించినట్లు తెలిపారు. మీ నకిలీ దయ మాకు అవసరం లేదు. ఇందుకు ప్రతిస్పందనగా రేపు నేను రాయబోయే బ్లాగ్‌లో ఓలా మ్యాప్స్‌పై కీలక అప్‌డేట్స్ ఇవ్వనున్నాను. వేచి చూడండి' అంటూ X వేదికగా చురకలంటించారు.
0 Comments