జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్‌, ఇతర నేతలతో కలిసి గవర్నర్‌ను కలిశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం చంపై సోరెన్‌ మీడియాతో మాట్లాడారు. కొన్ని నెలల కిందట ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదల కావడంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ నాయకుడిగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకున్నామని, అందుకే సీఎం పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జనవరి 31న ల్యాండ్‌ స్కామ్‌ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. అయితే దీనికి ముందుగా సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపై సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే ఐదు నెలలు జైలులో ఉన్న హేమంత్‌ సోరెన్‌కు జార్ఖండ్‌ హైకోర్టు జూన్‌ 28న బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు హేమంత్‌ సోరెన్‌ సిద్ధమయ్యారు. దీంతో సీఎం పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు.

Post a Comment

Previous Post Next Post