ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి దగ్గరలో జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో జంగిలి కేఫ్ టీ స్టాల్ దగ్గరలో ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తెనాలి నుంచి కారులో వేటపాలెం సముద్రతీరానికి ఐదుగురు యువకులు వచ్చారు. బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న జంగిల్ కేఫ్ టీస్టాల్ వద్ద కారు ఆపి టీ తాగారు. అనంతరం తిరిగి తెనాలి వైపు బయలు దేరారు. అదే సమయంలో కనిగిరికి చెందిన మన్నెపల్లి శిరీష (30) మరో వ్యక్తితో కలసి బాపట్ల వెళ్లి తిరిగి కనిగిరికి వెళుతున్నారు. జంగిల్ కేఫ్ టీస్టాల్ దగ్గరకి వచ్చే సరికి రెండు కార్లు వేగంగా ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. దీంతో ముందు భాగాలు భారీగా దెబ్బతిన్నాయి. కనిగిరి వెళుతున్న కారులో ఉన్న శిరీష తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు ఎదురుగా వచ్చిన కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్‌ఐ ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు కార్ల డోర్లు పగలగొట్టి అందులో ఇరుక్కుపోయిన వారిని 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని, శిరీష మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
0 Comments