తాజాగా ప్యారిస్ కేంద్రంగా 'వివా టెక్' పేరిట నిర్వహించిన స్టార్టప్ సదస్సులో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాబోయే రోజుల్లో ఉద్యోగం చేయడం ఒక వ్యాపకంగా మారుతుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అన్ని ఉత్పత్తులు, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని అంచనా వేశారు. అదే జరిగితే మనెవ్వరికీ జాబ్స్ ఉండకపోవచ్చునని వివరించారు. అవసరమైతే ఒక వ్యాపకంగా మాత్రమే ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు రావొచ్చని తెలిపారు. అయితే, ఆ స్థితికి చేరుకోవడానికి ప్రపంచంలో ప్రతిఒక్కరికీ 'యూనివర్సల్ హై ఇన్‌కమ్' ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పరోక్షంగా అందరికీ పెద్ద మొత్తంలో ఆదాయం ఉండాలని సూచించారు. దీనిపై ఆయన మరింత లోతుల్లోకి మాత్రం వెళ్లలేదు. కొన్నేళ్లలో ఏఐ సామర్థ్యాలు గణనీయంగా మెరుగయ్యాయని మస్క్ తెలిపారు. దీంతో ఈ అధునాతన సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కంపెనీలు, ప్రభుత్వాలు, నియంత్రణా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయని గుర్తుచేశారు. తనను వ్యక్తిగతంగా భయానికి గురిచేసేది 'టెక్నాలజీ' మాత్రమేనని చెప్పారు. ఇయాన్ బ్యాంక్స్ రాసిన 'కల్చర్' సిరీస్ పుస్తకాల్లో చూపించిన కల్పిత ప్రపంచం భవిష్యత్తులో ఆవిష్కృతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మస్క్ ఓ కీలక సూచన చేశారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు గడిపే సమయాన్ని నియంత్రించాలని సూచించారు. వాటికి అలవాటుపడటం కోసం డోపమైన్ అనే హార్మోన్‌ను పెంచే విధంగా ఏఐతో ప్రోగ్రామ్ చేస్తున్నారని వెల్లడించారు. దీనిని 'ఫీల్-గుడ్ హార్మోన్'గా వ్యవహరిస్తుంటారు. మనిషిలో ఆనందం, సంతృప్తి, ప్రేరణ వంటి భావాలకు ఇదే కారణమని వైద్యనిపుణులు చెబుతుంటారు. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిద్ర, సాధన, ఏకాగ్రత, కదలికల వంటి ఇతర శారీరక విధుల నియంత్రణలోనూ దీని పాత్ర ఉంటుంది.
రాబోయే రోజుల్లో ఉద్యోగం చేయడం ఒక వ్యాపకంగా మారుతుంది ?
Telugu Lo Computer
0
Comments
Post a Comment