విద్యుత్ డిమాండ్ పెరిగినా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Tuesday, October 6, 2026
Deputy CM Bhatti Vikramarka inspected the Pulichintala Hydroelectric Power Station telangana We are ensuring uninterrupted power supply despite rising demand with Uttam Kumar Reddy
పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతోపాటు జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లు ఉండగా ప్రస్తుతం దాదాపు 20 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి సుమారు నాలుగు వేల మెగావాట్లు తగ్గిందని చెప్పారు. దీంతో మొత్తంగా ఎనిమిది వేల మెగావాట్ల అదనపు భారం ఏర్పడినప్పటికీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు సమర్థంగా పనిచేస్తూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఇప్పటివరకు జరిగిన ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూనిట్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. అనంతరం మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టుల యంత్రాలు, యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేసే స్థితిలోనే ఉన్నాయని చెప్పారు. అవసరమైన స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం వల్లే జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిందన్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రత పెరగడం ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ గృహ వినియోగదారులకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రివేళల్లో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను థర్మల్ పవర్ ద్వారా అధిగమిస్తున్నామని తెలిపారు. ప్రజలు విద్యుత్ సరఫరాపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మనకంటే పెద్దదైన కర్ణాటకలో పీక్ విద్యుత్ డిమాండ్ సుమారు 20 వేల మెగావాట్లు ఉండగా తెలంగాణలోనూ ప్రస్తుతం అదే స్థాయికి చేరిందని తెలిపారు. ఏపీలో పీక్ డిమాండ్ సుమారు 12 వేల మెగావాట్లుగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. తదుపరి వర్షాకాలం వరకు అందుబాటులో ఉన్న నీటిని మనుషులు, పశువులు, పక్షుల తాగునీటి అవసరాలకు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. తాగునీటిని భవిష్యత్తు కోసం నిల్వ చేసుకోవడం సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. విద్యుత్ రంగంలో నిరంతరం శ్రమిస్తున్న జెన్‌కో సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయాన్నే టిఫిన్ అందించే పథకానికి సంబంధించిన సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున కేటాయించి అత్యాధునిక సదుపాయాలతో పాఠశాలలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఒకే ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన సుమారు 2,600 మంది విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనభ్యసించేలా వీటిని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామని వివరించారు. మునగాలలో విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డిలకు కాంగ్రెస్ శ్రేణులు, అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు. మునగాల హెలిప్యాడ్ నుంచి సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ శంకుస్థాపన వరకు దాదాపు నాలుగు కిలోమీటర్లు 500 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రూ.9.6 కోట్లతో నిరించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు.

No comments:
Post a Comment