Sunday, October 18, 2026

భారత నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, ఆపరేటర్లతో ఐదేళ్లకు పైగా కలిసి పని చేశాం : స్టార్‌లింక్

భారత్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ తెలిపింది. భారత నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, ఆపరేటర్లతో ఐదేళ్లకు పైగా కలిసి పనిచేశామని, అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులతో దేశంలో ప్రత్యేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని పేర్కొంది. స్టార్‌లింక్ ఎక్స్‌లో చేసిన పోస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం అంతకుముందు విడుదల చేసిన ప్రకటనను ట్యాగ్ చేసింది. స్టార్‌లింక్‌తో సహా శాటిలైట్ కమ్యూనికేషన్ల రంగంలో పోటీని స్వాగతిస్తున్నామని ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ తెలిపింది. అయితే అన్ని సంస్థలు భారత చట్టాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. దీనికి స్టార్‌లింక్ ఎక్స్‌లో స్పందిస్తూ భారత్‌లో నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, ఆపరేటర్లతో 5 ఏళ్లకు పైగా సన్నిహితంగా కలిసి పనిచేశాం. భారత ట్రాఫిక్‌ను మాత్రమే సురక్షితంగా, భద్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థలు, గేట్‌వేలు, ఇతర మౌలిక సదుపాయాలతో కూడిన నెట్‌వర్క్‌ను దేశంలోనే ఏర్పాటు చేశాం. ఇవన్నీ అవసరమైన ప్రభుత్వ అనుమతులతోనే జరిగాయి అని పేర్కొంది.